Bihar: నేడు రబ్రీ.. రేపు లాలూ.. మాజీ సీఎంలపై సీబీఐ వరుస విచారణ

సోమవారం బిహార్(BIhar) మాజీ ముఖ్యమంత్రి రబ్రీ దేవీని సీబీఐ ప్రశ్నించింది. తాజాగా లాలూ ప్రసాద్‌ యాదవ్‌కు సమన్లు జారీ చేసింది. 

Published : 06 Mar 2023 18:54 IST

పట్నా: ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌(Lalu Prasad Yadav)కు సోమవారం సీబీఐ సమన్లు జారీ చేసింది. ఆయన రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో ఉద్యోగాలు ఇప్పించేందుకు కొంతమంది అభ్యర్థుల నుంచి భూములు తీసుకున్నారన్న అభియోగాలపై నమోదైన కేసు (Land For Job Case)విచారణలో భాగంగా ఈ నోటీసులు ఇచ్చింది. మంగళవారం ఆయన్ను ప్రశ్నించనుంది. 

2004 నుంచి 2009 వరకు కేంద్రంలో యూపీఏ(UPA) హయాంలో లాలూ( Lalu Prasad Yadav) రైల్వే మంత్రిగా ఉన్నారు. ఈ క్రమంలోనే 2008-09 మధ్య రైల్వే ఉద్యోగాలకు నియామక ప్రక్రియ జరగ్గా.. కొందరు అభ్యర్థులకు ఉద్యోగాలు ఇచ్చేందుకు వారి నుంచి లాలూ కుటుంబం భూములు, ఇతర ఆస్తులను లంచంగా తీసుకున్నట్లు వచ్చిన ఆరోపణలను సీబీఐ విచారిస్తోంది. ఛార్జిషీట్‌లో లాలూ, ఆయన భార్య రబ్రీ దేవీతో పాటు 14 మంది పేర్లు ఉన్నాయి. ఈ క్రమంలో సోమవారం రబ్రీదేవీని పట్నాలోని ఆమె నివాసంలో సీబీఐ ప్రశ్నించింది. దర్యాప్తు సంస్థ రబ్రీ ఇంటికి వచ్చిన సమయంలో.. బిహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ అక్కడే ఉన్నారు.  ఆమె తర్వాత లాలూ వంతు వచ్చింది. కొద్ది నెలల క్రితం సింగపూర్‌లో మూత్రపిండాల మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్న లాలూ.. ఇటీవలే స్వదేశానికి తిరిగి వచ్చారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని