Birbhum killings: ఆ దోషుల్ని వదిలి పెట్టొద్దు: ప్రధాని మోదీ సీరియస్‌!

పశ్చిమబెంగాల్‌లోని బీర్‌భూం జిల్లాలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ సీరియస్‌ అయ్యారు. నిన్న జరిగిన ఘటనలు అత్యంత......

Published : 24 Mar 2022 01:15 IST

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ సీరియస్‌ అయ్యారు. నిన్న జరిగిన ఘటనలు అత్యంత హేయమైనవిగా పేర్కొన్న మోదీ.. ఈ ఘటనలో దోషుల్ని వదిలిపెట్టొద్దన్నారు. విక్టోరియల్‌ మెమోరియల్‌లో భారత స్వాతంత్య్ర సమరయోధులకు అంకితం చేసిన గ్యాలరీని బుధవారం ఆయన వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. హత్యాకాండలో నేరస్థుల్ని చట్టం ముందుకు తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అవసరమైన సహకారాన్ని కేంద్రం అందిస్తుందన్నారు. వీలైనంత త్వరగా దోషుల్ని చట్టం ముందుకు తీసుకొస్తారని భావిస్తున్నట్టు పేర్కొన్నారు. 

బీర్‌భూం హింసాత్మక ఘటనలో మృతులకు ప్రధాని ఈ సందర్భంగా సంతాపం తెలిపారు. ఇలాంటి క్రూరమైన నేరాలకు పాల్పడిన పాల్పడేవారిని, అలాంటివారికి సహకరించేవారిని ఎప్పటికీ క్షమించరాదని బెంగాల్‌ ప్రజలకు పిలుపునిచ్చారు. దోషుల్ని పట్టుకొనేందుకు ఎలాంటి సాయం చేసేందుకైనా కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. మరోవైపు, ప్రధాని వ్యాఖ్యలపై స్పందించిన తృణమూల్‌ కాంగ్రెస్ నేత, సీనియర్‌ మంత్రి పార్థ ఛటర్జీ దోషులను వేటాడి శిక్షిస్తామన్నారు. 

బీర్‌భూం జిల్లా రామ్‌పుర్ హాట్‌ పట్టణ శివారులోని బోగ్‌టూయి గ్రామంలో మంగళవారం తెల్లవారుజామున ఎనిమిది ఇళ్లు అగ్నికి ఆహుతై ఇద్దరు చిన్నారులతో పాటు ఎనిమిది మంది సజీవ దహనమైన ఘటన తీవ్ర విషాదం నింపిన విషయం తెలిసిందే. సోమవారం రాత్రి తృణమూల్‌ కాంగ్రెస్‌కు చెందిన బర్షాల్‌ గ్రామ పంచాయతీ ఉప ప్రధాన్‌ బాదు షేక్‌ హత్య జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే ఈ దుర్ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. వ్యక్తిగత కక్షల అనుమానంతో ఈ ఘటనలో 11 మందిని అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. టీఎంసీ నేత హత్యకు ప్రతీకారంగానే ఇళ్లకు నిప్పుపెట్టినట్టు స్థానికులు ఆరోపిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని