Published : 05 Jul 2022 19:58 IST

Umesh Kolhe: ముందురోజు తప్పించుకున్నా.. తర్వాత చావు తప్పలేదు..!

కెమిస్ట్ హత్య కేసులో వెలుగులోకి కీలక విషయాలు

ముంబయి: మహారాష్ట్రలోని అమరావతిలో కెమిస్ట్‌ ఉమేశ్‌ కొల్హే హత్య కేసు విచారణలో కీలక విషయాలు వెలుగుచూస్తున్నాయి. తాజాగా దానికి సంబంధించిన సీసీటీవీ వీడియోలు బయటకు వచ్చాయి. కొల్హేను హతమార్చేందుకు ముందురోజే రెక్కీ నిర్వహించినా.. మృతుడు తన దుకాణం ముందుగా మూసివేయడంతో సాధ్యం కాలేదని తెలుస్తోంది. 

భాజపా బహిష్కృత నేత నుపుర్‌శర్మ చేసిన మతపరమైన వ్యాఖ్యలకు మద్దతుగా పోస్టు చేసినందుకు ఉమేశ్‌ను గత నెల 21న హత్య చేసినట్లు ఇదివరకే పోలీసులు వెల్లడించారు. వాస్తవంగా జూన్‌ 20నే ఉమేశ్‌ను హత్యచేయాలని నిందితులు ప్రణాళిక వేశారు. అతడి దుకాణం వద్ద కాపు కాశారు. రాత్రి 10-10.30 గంటల సమయంలో దుకాణం మూసివేస్తాడని వారు భావించగా.. ఆ రోజు అతడు 9.30 గంటలకే ఇంటికి వెళ్లిపోయాడు. దాంతో పథకం ఫలించలేదు. కానీ మరుసటి రోజు మాత్రం ఉమేశ్ చావు నుంచి తప్పించుకోలేకపోయాడని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.  

ఈ హత్య కేసుకు సంబంధించి మరికొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఉమేశ్‌, మరికొందరు కలిసి బ్లాక్‌ ఫ్రీడమ్ అనే వాట్సాప్‌ గ్రూప్‌ను నిర్వహిస్తున్నారు. దానిలో ఇతర మతస్థులు కూడా ఉన్నారు. అందులో నుపుర్ శర్మ వ్యాఖ్యలకు మద్దతుగా అతడు పోస్టు పెట్టారు. ఆ గ్రూప్‌లో సభ్యుడు, ఉమేశ్ స్నేహితుడు యూసుప్ ఖాన్ ఆ సందేశాన్ని ఇతర గ్రూప్‌లకు ఫార్వర్డ్ చేశాడు. అందులో కలీం ఇబ్రహీమ్ అనే గ్రూప్ కూడా ఉంది. కలీం గ్రూప్‌నకు చెందిన ఇర్ఫాన్ ఖాన్ ఈ పోస్టుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. మరో ఐదురుగురితో కలిసి హత్యకు ప్రణాళిక రచించాడు. కాగా, ఈ కేసులో ఇర్ఫాన్‌, యూసుఫ్‌తో సహా మొత్తం ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు. మరో విషయం ఏంటంటే.. రెహ్‌బార్ అనే ఎన్‌జీఓను నడుపుతోన్న యూసుఫ్.. ఉమేశ్ అంత్యక్రియల్లో పాల్గొన్నాడు. ప్రస్తుతం ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) విచారిస్తోంది. 

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని