Sputnik V:హైదరాబాద్‌ చేరిన రష్యా వ్యాక్సిన్‌

భారత్‌లో మరో వ్యాక్సిన్‌ అందుబాటులోకి రానుంది. రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్‌-వి

Updated : 01 May 2021 17:15 IST

దిల్లీ: భారత్‌లో మరో వ్యాక్సిన్‌  త్వరలో అందుబాటులోకి రానుంది. రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్‌-వి టీకాలు మాస్కో నుంచి ప్రత్యేక విమానంలో నేడు హైదరాబాద్‌ చేరుకున్నాయి. తొలి విడతలో భాగంగా 1.5 లక్షల వయల్స్‌ భారత్‌కు అందాయి. వీటిని తొలుత భారత్‌లో స్పుత్నిక్‌-వి క్లినికల్‌ ట్రయల్స్ నిర్వహించిన డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్‌కు అందించనున్నారు. కసౌలీలోని సెంట్రల్‌ డ్రగ్స్‌ ఆమోదం లభించిన తర్వాత రెడ్డీస్‌ ల్యాబ్స్‌ వీటిని వ్యాక్సినేషన్‌ ప్రక్రియకు అందించనుంది.  ఈ నెలలోనే మరో మూడు మిలియన్ల డోసులు, జూన్‌లో ఐదు మిలియన్లు, జులైలో మరో 10 మిలియన్ల డోసులు భారత్‌కు రానున్నట్లు దౌత్య వర్గాలు ఇటీవల వెల్లడించాయి.

రష్యన్‌ డైరెక్ట్‌ ఇన్వెస్టిమెంట్‌ ఫండ్‌(ఆర్‌డీఐఎఫ్‌) సహకారంతో గమలేయా ఇన్‌స్టిట్యూట్‌ తయారు చేసిన స్పుత్నిక్‌ టీకాను భారత్‌లో ఉత్పత్తి, పంపిణీకి గతేడాది సెప్టెంబర్‌లోనే డాక్టర్‌ రెడ్డీస్‌తో ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా.. రెండు, మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించిన డాక్టర్‌ రెడ్డీస్‌ భారత్‌లో అత్యవసర వినియోగానికి ఏప్రిల్‌ 12న డీసీజీఐ నుంచి అనుమతి పొందింది. భారత్‌లో ఆమోదం పొందిన మూడో టీకా ఇది. ఇప్పటికే కొవిషీల్డ్‌, కొవాగ్జిన్‌ టీకాలు ప్రజలకు అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే.

నేటి నుంచి దేశవ్యాప్తంగా 18 ఏళ్లు పైబడిన వారందరికీ టీకా ఇచ్చేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. అయితే, టీకాల కొరత కారణంగా మెజారిటీ రాష్ట్రాలు 18 ఏళ్లు పైబడిన వారికి ఇప్పుడప్పుడే టీకాలు ఇవ్వలేమని ప్రకటించాయి. మరోవైపు దేశవ్యాప్తంగా కరోనా కేసులు ఇంకా భారీ స్థాయిలో నమోదవుతున్నాయి. మహమ్మారి నియంత్రణకు టీకా కార్యక్రమాన్ని వేగవంతం చేయడం ఒక్కటే మార్గమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ తరుణంలో స్పుత్నిక్‌-వి టీకాలు భారత్‌ చేరుకోవడం ఊరట కలిగించే అంశం.  ఇక ఈ నెలలోనే భారత్‌లో రెడ్డీస్‌ ల్యాబ్స్‌ ఈ టీకా ఉత్పత్తి ప్రారంభించనున్నట్లు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని