Tribunals: కదిలిన కేంద్రం.. ఎట్టకేలకు రెండు ట్రైబునళ్లలో ఖాళీల భర్తీ

నేషనల్‌ కంపెనీ లా ట్రైబ్యునల్‌(ఎన్‌సీఎల్‌టీ), ఇన్‌కం ట్యాక్స్‌ అప్పీలేట్‌ ట్రైబ్యునల్‌(ఐటీఏటీ)లలో ఖాళీలను కేంద్రం ఎట్టకేలకు భర్తీ చేసింది. ఎన్‌సీఎల్‌టీలో జ్యుడిషియల్‌, టెక్నికల్‌, ఐటీఏటీలో జ్యుడిషియల్‌, అకౌంటెంట్‌ విభాగాల్లో 31 మంది సభ్యులను నియమించింది...

Published : 12 Sep 2021 23:05 IST

దిల్లీ: నేషనల్‌ కంపెనీ లా ట్రైబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ), ఇన్‌కం ట్యాక్స్‌ అప్పీలేట్‌ ట్రైబ్యునల్‌ (ఐటీఏటీ)లలో ఖాళీలను కేంద్రం ఎట్టకేలకు భర్తీ చేసింది. ఎన్‌సీఎల్‌టీలో జ్యుడీషియల్‌, టెక్నికల్‌.. ఐటీఏటీలో జ్యుడీషియల్‌, అకౌంటెంట్‌ విభాగాల్లో 31 మంది సభ్యులను నియమించింది. ఆయా ట్రైబ్యునళ్లలో ఖాళీలు, నియామకాల వ్యవహారంలో కేంద్రం తీరుపై సుప్రీంకోర్టు ఈ నెల 6న అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 13వ తేదీలోగా తమ తీరు మార్చుకోవాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో కేంద్రం ఈ నియామకాలు చేపట్టింది.

కేబినెట్‌ నియామకాల కమిటీ నిర్ణయాల ఆధారంగా డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ పర్సనల్‌ అండ్‌ ట్రైనింగ్‌ విభాగం ఆదివారం నియామకాల వివరాలు విడుదల చేసింది. ఎన్‌సీఎల్‌టీలో ఎనిమిది మంది జ్యుడీషియల్‌, 10 మంది టెక్నికల్‌ సభ్యులు నియమితులయ్యారు. ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ తెలప్రోలు రజనీ జ్యుడీషియల్‌ విభాగంలో నియమితులైన వారిలో ఉన్నారు. బాధ్యతలు స్వీకరించిన తేదీ నుంచి ఐదేళ్లపాటు లేదా 65 ఏళ్లు వచ్చే వరకు లేదా తదుపరి ఉత్తర్వులు జారీ అయ్యే వరకు వీరు సభ్యులుగా కొనసాగుతారు. ఐటీఏటీలో ఆరుగురు జ్యుడీషియల్‌, ఏడుగురు అకౌంటెంట్‌ సభ్యులను భర్తీ చేశారు. వీరు నాలుగేళ్లపాటు బాధ్యతల్లో ఉంటారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని