Air Force Day: మొదటిసారి దిల్లీ వెలుపల.. ఐఏఎఫ్ 90వ వార్షికోత్సవ వేడుకలు

శనివారం భారత వైమానిక దళ 90వ వార్షికోత్సవ వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి. తొలిసారి దేశ రాజధాని దిల్లీ వెలుపల జరుగుతోన్న ఈ కార్యక్రమంలో ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్‌ చౌధరీ మాట్లాడుతూ.. కీలక ప్రకటనలు చేశారు.

Updated : 08 Oct 2022 16:22 IST

దిల్లీ: భారత వైమానిక దళ 90వ వార్షికోత్సవాలు శనివారం అట్టహాసంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా కేంద్రపాలిత ప్రాంతమైన చండీగఢ్‌లోని సుఖ్నా సరస్సుపై సుమారు 80 విమానాలతో ప్రదర్శన నిర్వహించారు. తొలిసారి దేశ రాజధాని దిల్లీ వెలుపల జరుగుతోన్న ఈ కార్యక్రమంలో ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్‌ చౌధరీ మాట్లాడుతూ.. కీలక ప్రకటనలు చేశారు. 

‘ఐఏఎఫ్ దళం కోసం వెపన్ సిస్టమ్‌(ఆయుధ వ్యవస్థ) బ్రాంచ్ ఏర్పాటునకు కేంద్రం అనుమతి ఇచ్చింది. ఈ చరిత్రాత్మక సమయంలో ఈ ప్రకటన చేయడాన్ని గౌరవంగా భావిస్తున్నాను. ఈ వెపన్‌ సిస్టం బ్రాంచ్‌ కింద వైమానిక సిబ్బంది అత్యాధునిక ఆయుధాల వినియోగంలో శిక్షణ పొందుతారు. స్వాతంత్య్రం తర్వాత ఈ తరహా ఏర్పాటు ఇదే మొదటిది. దీని ద్వారా ప్రభుత్వానికి 3,400 కోట్లు ఆదా కానుంది’ అని చౌధరీ వెల్లడించారు.

అలాగే వచ్చే ఏడాది నుంచి వైమానిక దళంలోకి మహిళా అగ్నివీరుల్ని తీసుకోవడం ప్రారంభిస్తామని చెప్పారు. అంతేగాకుండా కొత్త యుద్ధ యూనిఫాంను కూడా ప్రదర్శించారు. ఈ ఏడాది ఐఏఎఫ్‌ డే ప్రత్యేకంగా స్వదేశీయతపై దృష్టిసారించింది. ఈ సందర్భంగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన వాటిని ప్రదర్శిస్తున్నారు. అందులో వాయుసేన అమ్ముల పొదిలో చేరిన ప్రచండ్ కూడా ఒకటి. ఇది అత్యాధునిక తేలికపాటి యుద్ధ హెలికాప్టర్‌. ఇటీవల దీనిని వైమానిక దళంలోకి ప్రవేశపెట్టారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని