చిమ్మచీకట్లో భారత నేవీ అరుదైన ఘనత..ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌పై మిగ్‌ ల్యాండింగ్‌

భారత నౌకా దళం సరికొత్త మైలురాయిని చేరుకుంది. రాత్రిపూట ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌పై.. మిగ్‌-29కె ల్యాండ్‌ అయింది. దీనిపై రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్(Defence Minister Rajnath Singh) సంతోషం వ్యక్తం చేశారు. 

Published : 25 May 2023 21:32 IST

దిల్లీ: భారత నౌకా దళం(Indian Navy) అరుదైన ఘనత సొంతం చేసుకుంది. చిమ్మచీకట్లో మిగ్‌-29కె(MiG-29K) యుద్ధవిమానం.. దేశీయంగా నిర్మించిన తొలి విమాన వాహక నౌక ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌(indigenously built aircraft carrier INS Vikrant)పై విజయవంతంగా ల్యాండ్ అయింది. రాత్రి సమయంలో తొలిసారి నిర్వహించిన ఈ పరీక్షలో పైలట్లు విజయం సాధించారు. ఈ దీనికి సంబంధించిన వీడియోను భారత నౌకా దళం ట్విటర్‌లో షేర్ చేసింది.

‘ఆత్మనిర్భరతకు నౌకాదళం ఇస్తున్న ప్రాధాన్యతకు ఇది నిదర్శనం. ఐఎన్‌ఎస్ విక్రాంత్‌ ఫ్లైట్‌ డెక్‌పై చీకట్లో ఫైటర్‌ జెట్ ల్యాండ్‌ కావడం కనిపిస్తోంది’ అని ట్వీట్‌లో సంతోషం వ్యక్తం చేసింది. అలాగే దీనిపై రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్(Defence Minister Rajnath Singh) నౌకాదళానికి అభినందనలు తెలియజేశారు. ‘ఈ అద్భుతమైన విజయం.. విక్రాంత్‌ సిబ్బంది, నౌకాదళ పైలట్ల నైపుణ్యాలు, పట్టుదలకు నిదర్శనం’ అని అన్నారు.

యుద్ధవిమానాలు సాధారణ రన్‌వేపై దిగడానికి, విక్రాంత్‌ ఫ్లైట్‌ డెక్‌పై ల్యాండ్‌ అవడానికి మధ్య తేడా ఉంది. ఫ్లైట్ డెక్‌ పొడవు తక్కువగా ఉండటమే అందుకు కారణం. ఈ ల్యాండింగ్‌ కోసం జెట్ వేగాన్ని అనూహ్యంగా తగ్గించాల్సి ఉంటుంది. విమాన వాహక నౌక కూడా కదులుతూ ఉంటుంది కాబట్టి రాత్రిపూట ఈ ల్యాండింగ్ అనేది అత్యంత సవాలుతో కూడి ఉంటుంది. వాహన నౌక వేగానికి అనుగుణంగా జెట్‌ వేగంలో మార్పు చేసుకోవాలి.

ఇక దేశీయంగా నిర్మించిన విక్రాంత్‌(INS Vikrant) నౌక 262 మీటర్ల పొడవు, 62 మీటర్ల వెడల్పుతో 43,000 టన్నుల బరువు ఉంది. ఇది గంటకు 28 నాట్స్‌ వేగంతో ఏకధాటిగా 7,500 నాటికల్‌ మైళ్లు ప్రయాణించగలదు. ఈ నౌక నిర్మాణానికి సుమారు రూ.20,000 కోట్లను భారత ప్రభుత్వం ఖర్చు పెట్టింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు