Updated : 31 Aug 2021 15:01 IST

Afghanistan: అల్విదా అఫ్గాన్‌.. కాబుల్‌ను వీడిన చిట్టచివరి అమెరికా సైనికుడితడే..

కాబుల్‌: ఉగ్రవాదంపై పోరులో 20 ఏళ్ల సుదీర్ఘ యుద్ధాన్ని ముగించుకుని అఫ్గాన్‌ గడ్డ నుంచి అమెరికా సైన్యం వెనుదిరిగింది. సోమవారం అర్ధరాత్రికి ఒక నిమిషం ముందు కాబుల్‌ ఎయిర్‌పోర్టు నుంచి యూఎస్‌ రక్షణ దళాలతో కూడిన చివరి విమానం బయల్దేరింది. అధ్యక్షుడు జో బైడెన్‌ విధించిన ఆగస్టు 31 గడువు కంటే ఒక రోజు ముందే అమెరికా దళాలు అఫ్గాన్‌ను వీడాయి. దీంతో రెండు దశాబ్దాల యుద్ధానికి సంపూర్ణ ముగింపు పలికినట్లయింది. అఫ్గాన్‌ వీడుతున్న చిట్టచివరి సైనికుడి ఫొటోను అమెరికా విడుదల చేసింది. వియత్నాం యుద్ధానికి, అఫ్గాన్‌ యుద్ధానికి దాదాపు చాలా పోలికలున్నాయి. ఈ క్రమంలో వియత్నాం యుద్ధంలో చిట్టచివరి వ్యక్తి కూడా అఫ్గాన్‌ యుద్ధంలో భాగమవ్వడం గమనార్హం. 

చివరి సైనికుడు.. కమాండర్‌ డోనాహువే

అఫ్గానిస్థాన్‌ను వీడిన చిట్టచివరి అమెరికా సైనికుడు మేజర్‌ జనరల్‌ క్రిస్‌ డోనాహువే. సోమవారం అర్ధరాత్రి కాబుల్‌ నుంచి బయల్దేరిన సీ-17 విమానంలోకి చివరగా ఎక్కింది ఈయనే. ఈ విషయాన్ని అమెరికా రక్షణశాఖ కార్యాలయం ట్విటర్‌ వేదికగా ప్రకటిస్తూ మేజర్‌ జనరల్ విమానం వద్దకు వస్తోన్న ఫొటోను విడుదల చేసింది. మేజర్‌ జనరల్‌ డోనాహువే.. 82వ ఎయిర్‌బోర్న్‌ డివిజన్‌లో కమాండర్‌గా పనిచేస్తున్నారు. కాబుల్‌లో అమెరికా మిషన్‌ను ముగించుకుని చివరగా ఆయన విమానమెక్కారు. ఇదే విమానంలో అఫ్గాన్‌కు అమెరికా రాయబారి రాస్‌ విల్సన్‌ కూడా ఉన్నారు. మేజర్‌ జనరల్‌ గతేడాదే ఎయిర్‌బోర్న్‌ డివిజన్‌ కమాండర్‌గా బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు కంబైన్డ్‌ జాయింట్‌ స్పెషల్‌ ఆపరేషన్‌ టాస్క్‌ఫోర్స్‌ కమాండర్‌గా పనిచేశారు. 

తాలిబన్‌ కమాండర్‌తో మాట్లాడి..

అమెరికా బయల్దేరడానికి ముందు మేజర్‌ జనరల్‌ డోనాహువే.. కాబుల్ ఎయిర్‌పోర్టు వద్ద ఉన్న తాలిబన్‌ కమాండర్‌తో మాట్లాడారని యూఎస్‌ సెంట్రల్‌ కమాండ్‌ హెడ్‌ జనరల్‌ మెకంజీ తెలిపారు. అమెరికా దళాలు అఫ్గాన్‌ను వీడుతున్నట్లు డోనాహువే తాలిబన్లకు చెప్పినట్లు పేర్కొన్నారు. 

15రోజుల్లో 1.23లక్షల మందిని తరలించి..

తాలిబన్లు కాబుల్‌ను హస్తగతం చేసుకోవడంతో ఆ దేశ పౌరులు విమానాశ్రయానికి పోటెత్తారు. దీంతో అమెరికా.. వారిని అక్కడి నుంచి మరో దేశానికి తరలించింది. ఆగస్టు 14 నుంచి దాదాపు 1.23లక్షల మంది అఫ్గాన్‌ వాసులను తరలించినట్లు జనరల్‌ మెకంజీ వెల్లడించారు. అమెరికా చరిత్రలోనే ఇదే అతిపెద్ద తరలింపు ప్రక్రియ అని తెలిపారు. 

చివరి రోజుల్లో ఉద్రిక్తత..

గడిచిన వారం రోజుల్లో కాబుల్‌ విమానాశ్రయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎయిర్‌పోర్టు గేటు వద్ద ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాదులు జరిపిన ఆత్మాహుతి దాడిలో 13 మంది అమెరికా జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో అప్రమత్తమైన అగ్రరాజ్యం.. విమానాశ్రయం వద్ద నిఘా పెంచింది. ముష్కరులు ప్రయోగించిన రాకెట్లను తిప్పికొట్టింది. ఈ పరిణామాల నేపథ్యంలోనే అత్యంత భద్రత నడుమ చిట్టచివరి విమానం కాబుల్‌ నుంచి బయల్దేరింది. అయితే అమెరికా సైన్యం తరలింపు పూర్తయినప్పటికీ.. దౌత్యపరమైన మిషన్‌ కొనసాగుతుందని జనరల్‌ మెకంజీ తెలిపారు. అఫ్గాన్‌ వీడాలనుకునే ఆ దేశ పౌరులు, అమెరికా దేశస్థులను తరలిస్తామని వెల్లడించారు. 

వియత్నాం యుద్ధంలో ఆయన..

వియత్నాంలో యుద్ధంలో జేమ్స్‌ ఎర్లె పార్కర్‌ అనే సెంట్రల్‌ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీ అధికారి పేరు చివరిసారి వియత్నాంను వీడిన అమెరికా అధికారిగా నిలిచిపోయింది. మరో విశేషం ఏమిటంటే వియత్నాంను ఆక్రమించడానికి 1965లో వెళ్లిన తొలినాటి అమెరికా ఇన్‌ఫాంట్రి దళాల్లో ఆయన సభ్యుడు. చిట్ట చివర వియత్నాంను వీడింది కూడా ఆయనే. సీఐఏ కోవర్ట్‌ ఆపరేషన్లకు 34ఏళ్లపాటు తన సేవలను అందించాడు. దక్షిణ వియత్నాం రాజధాని సైగాన్‌ను ఉత్తర వియత్నాం దళాలు ఆక్రమించుకొన్న రెండు రోజుల తర్వాత పార్కర్‌ డెల్టా అనే నదీ మార్గంలో ఓ పడవపై తప్పించుకొన్నారు. 1992లో ఆయన సీఐఏ నుంచి రిటైర్‌ అయ్యారు. కానీ, 2001లో 9/11 దాడుల దర్యాప్తు కోసం తిరిగి సీఐఏలో చేరారు. తర్వాత 11 ఏళ్లపాటు అమెరికా ఆర్మీ స్పెషల్‌ ఫోర్స్‌, నేవీ సీల్స్‌ బృందాల కోసం పనిచేశారు. 2012లో రిటైర్‌ అయ్యారు. 2018లో క్యాన్సర్‌తో పోరాడుతూ లాస్‌ వేగాస్‌లో మరణించారు.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని