Wrestlers Protest: బ్రిజ్‌భూషణ్‌పై పోక్సో కేసులో ఆమె మైనర్ కాదా..? ఆమె తండ్రి ఏం చెప్పారంటే..?

Wrestlers Protest: రెజ్లర్ల ఆందోళనలో ఇటీవల కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. మైనర్ దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌పై తాజాగా ఆమె తండ్రి ఓ జాతీయ మీడియా సంస్థ వద్ద స్పందించారు. 

Updated : 08 Jun 2023 10:39 IST

దిల్లీ: లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటోన్న భాజపా ఎంపీ బ్రిజ్‌భూషణ్‌(Brij Bhushan Sharan Singh)పై చర్యలు తీసుకోవాలని కొద్దినెలలుగా రెజ్లర్లు ఆందోళన నిర్వహించారు. కేంద్ర హోం మంత్రి, క్రీడల శాఖ మంత్రి జోక్యంతో ప్రస్తుతం దానికి తాత్కాలిక విరామం ఇచ్చారు. అయితే కుస్తీయోధుల ఫిర్యాదుతో దాఖలైన ఓ ఎఫ్‌ఐఆర్‌ విషయంలో కీలక విషయాలు ప్రచారంలోకి వస్తున్నాయి. ఈ క్రమంలో మైనర్ రెజ్లర్‌ పెట్టిన కేసుకు సంబంధించి ఆమె తండ్రి ఓ జాతీయ మీడియాతో మాట్లాడారు. (Wrestlers Protest)

వేధింపులకు గురైనట్లు చెప్తోన్న సమయంలో సదరు యువతి.. మైనర్ కాదని గుర్తించడంతో, మేజిస్ట్రేట్ ఎదుట ఆమె నుంచి మరోసారి వాంగ్మూలం  తీసుకొన్నట్లు తెలుస్తోంది. వేధింపుల కేసు అలాగే ఉందని, ఎఫ్‌ఐఆర్‌లో ప్రస్తావించిన వయసుకు సంబంధించిన అంశంలో మార్పు చేశారని ఆ యువతి తండ్రి జాతీయ మీడియా సంస్థకు తెలిపారు. ఈ మార్పుతో బ్రిజ్‌భూషణ్‌పై ఉన్న పోక్సో అభియోగాలపై న్యాయస్థానం నిర్ణయం తీసుకోవాల్సిఉంది.

ఆరుగురు రెజ్లర్ల(Wrestlers)తో పాటు మైనర్‌గా పేర్కొన్న మరో యువతి ఫిర్యాదు ఆధారంగా దిల్లీ పోలీసులు ఏప్రిల్ 28న బ్రిజ్ భూషణ్ పై రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసిన సంగతి తెలిసిందే. మైనర్ తండ్రి ఎఫ్‌ఐఆర్ వెనక్కి తీసుకున్నట్లు ఇదివరకు వార్తలు వచ్చాయి. దానిపై అప్పుడే బజరంగ్ పునియా స్పందించారు. ఆ వార్తలపై తాము బాలిక తండ్రిని సంప్రదించగా.. ఆయన వాటిని తోసిపుచ్చారన్నారు.

ఇదిలా ఉంటే.. నిన్న కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌(Anurag Thakur)తో దాదాపు అయిదు గంటలకు పైగా జరిగిన సమావేశంలో రెజ్లర్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. బ్రిజ్‌భూషణ్‌పై ఈ నెల 15 లోపు ఛార్జ్‌షీట్‌ దాఖలు చేస్తామని, జూన్‌ 30లోపు డబ్ల్యూఎఫ్‌ఐకి ఎన్నికలు నిర్వహిస్తామని  కేంద్రం పేర్కొంది. దాంతో ప్రభుత్వం కోరికమేరకు ఉద్యమాన్ని వారం పాటు నిలిపివేస్తున్నట్లు రెజ్లర్లు వెల్లడించారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు