Arjun Ram Meghwal: 14 ఏళ్లకే పెళ్లి.. ఆ తర్వాత కలెక్టరై: కొత్త న్యాయశాఖ మంత్రి విశేషాలివే..!

రాజస్థాన్‌కు చెందిన భాజపా నేత, కేంద్ర సహాయ మంత్రి అర్జున్‌ రామ్‌మేఘ్వాల్‌ (Arjun Ram Meghwal)..తాజాగా న్యాయశాఖ మంత్రిగా బాధ్యతలను అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన గురించి కొన్ని విశేషాలివే. 

Updated : 18 May 2023 19:16 IST

దిల్లీ: కేంద్రమంత్రి వర్గంలో గురువారం భారీ మార్పు చోటుచేసుకుంది. న్యాయశాఖ మంత్రి (Law Minister)గా ఉన్న కిరణ్‌ రిజిజు (Kiren Rijiju)ను ఆ బాధ్యతల నుంచి తొలగించి, కేంద్ర సహాయ మంత్రి అర్జున్‌ రామ్‌మేఘ్వాల్‌ (Arjun Ram Meghwal)కు ఆ శాఖ అదనపు బాధ్యతలను అప్పగించారు. స్వతంత్ర హోదాలో మేఘ్వాల్‌ ఆ శాఖను పర్యవేక్షించనున్నారు. 14 ఏళ్లకే వివాహం చేసుకొని, ఐఏఎస్‌ అధికారిగా బాధ్యతలు నిర్వర్తించిన ఆయన.. ఇప్పుడు న్యాయశాఖ మంత్రిగా ఎదిగిన తీరున ఓ సారి చూద్దాం..

మేఘ్వాల్.. రాజస్థాన్‌(Rajasthan)లోని బికనేర్‌లోని మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి. తన ఊరిలోని ప్రభుత్వ పాఠశాలలో ప్రాథమిక విద్యను పూర్తిచేశారు. ఎనిమిదో తరగతి చదువుతుండగా కుటుంబ సభ్యులు ఆయనకు వివాహం జరిపించారు. అప్పుడు ఆయన వయస్సు 14 సంవత్సరాలే. పెళ్లి తర్వాత ఆయన ఉన్నత విద్య కొనసాగించారు. బీఏ, ఎల్‌ఎల్‌బీ, ఎంఏ, ఎంబీఏ పట్టాలు పొందారు. రాజస్థాన్‌ అడ్మినిస్ట్రేటివ్‌ సర్వీసెస్‌ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన ఆయన.. రాష్ట్ర స్థాయిలో వివిధ హోదాల్లో పనిచేశారు.

అనంతరం 1999లో రాజస్థాన్‌ క్యాడర్‌లో ఐఏఎస్‌గా పదోన్నతి పొందారు. తర్వాత ఆయన మనసు రాజకీయాలవైపు మళ్లింది. 2009లో భాజపా టికెట్‌పై పోటీ చేసి లోక్‌సభలో అడుగుపెట్టారు. పార్లమెంట్ సభ్యుడిగా పలు కమిటీల్లో భాగమయ్యారు. రాజస్థాన్‌లో పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగానూ సేవలందించారు. భాజపా జాతీయ కార్యవర్గ సభ్యుడిగా, లోక్‌సభలో చీఫ్ విప్‌గానూ బాధ్యతలు నిర్వర్తించారు. 

సైకిల్‌ మీద పార్లమెంట్‌కు..

మేఘ్వాల్‌.. తాను పనిచేసే ప్రదేశానికి సైకిల్ మీద వెళ్లడానికి ఎక్కువగా ఇష్టపడతారు. పలుమార్లు లోక్‌సభకు అలాగే వచ్చారు. అలా ఆయన పేరు అందరికీ సుపరిచితం. అయితే 2016లో కేంద్రమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నుంచి భద్రతా కారణాల దృష్యా సైకిల్‌పై రావడంలేదు. ఇక ప్రస్తుతం ఆయన పార్లమెంటరీ వ్యవహారాల శాఖ, సాంస్కృతిక శాఖ సహాయ మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు.

న్యాయశాఖ బాధ్యతలు చేపట్టిన అనంతరం మేఘ్వాల్‌ మీడియాతో మాట్లాడుతూ.. న్యాయవ్యవస్థ, ప్రభుత్వం మధ్య సత్సంబంధాలున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా కొలీజియం వివాదం నేపథ్యంలోనే రిజిజును న్యాయశాఖ బాధ్యతల నుంచి తప్పించారన్న వార్తలను ఆయన కొట్టిపారేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని