Kashmir Killings: ఆన్‌లైన్‌లో ఉగ్రశిక్షణ.. ఆపై హత్యలు..!

అందాల కశ్మీర్‌ లోయ తుపాకుల మోతతో దద్దరిల్లింది. కశ్మీరీ పండితులు, మైనార్టీలను లక్ష్యంగా చేసుకుని జరిగిన ఊచకోత యావత్‌ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు మూడు నెలల్లో ఏకంగా

Updated : 03 Jun 2022 12:49 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: అది 1990 జనవరి - మార్చి.. ఆ మూడు నెలలు అందాల కశ్మీర్‌ లోయ తుపాకుల మోతతో దద్దరిల్లింది. కశ్మీరీ పండితులు, అల్పసంఖ్యాక వర్గాలను లక్ష్యంగా చేసుకొని జరిగిన ఊచకోత యావత్‌ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు మూడు నెలల్లో ఏకంగా 32 మందిని అతి దారుణంగా హత్యచేశారు. ప్రాణ భయంతో వేలాది కశ్మీరీ పండితుల కుటుంబాలు కట్టుబట్టలతో లోయను విడిచి జమ్మూ, ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సి వచ్చింది. సరిగ్గా మూడు దశాబ్దాల తర్వాత కశ్మీర్‌ లోయ మళ్లీ అటువంటి పరిస్థితులనే చవిచూస్తోంది. ముష్కరులు టార్గెట్‌ చేసి మరీ కశ్మీరీ హిందువులు, అల్పసంఖ్యాక వర్గాల వారిని హత్యలు చేస్తున్నారు. అయితే దాదాపు ఏడాది నుంచి ఉగ్రవాదులు ‘హైబ్రీడ్‌’ పంథాను ఎంచుకున్నారు. స్థానిక యువతను ఆకర్షించి వారికి ఆన్‌లైన్‌లోనే శిక్షణ ఇప్పించి నేరాలు చేయిస్తున్నారు.

అంతా ఇంటర్నెట్‌లోనే..

కశ్మీరీలో వరుస దాడులకు ఉగ్రవాదులు కొత్త పంథాను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. స్థానిక యువతను ఆకర్షించి 10 - 15 రోజులు ఆన్‌లైన్‌లో శిక్షణ ఇచ్చి ఆ తర్వాత వారితో నేరాలు చేయిస్తున్నట్లు జమ్మూకశ్మీర్‌ పోలీసులు చెబుతున్నారు. గత మంగళవారం కుల్గామ్‌లో రజిని బాలా అనే ఉద్యోగిని ముష్కరులు కాల్చి చంపిన విషయం తెలిసిందే. దుండగులు ఆమెను అతి సమీపం నుంచి కాల్చినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. రజిని హత్యకు పాల్పడిన నిందితులు లష్కరే తోయిబాకు చెందిన హైబ్రీడ్‌ ఉగ్రవాదులని పోలీసు వర్గాలు తెలిపాయి. ఈ దాడికి కేవలం 10 రోజుల ముందే వారిని లష్కరే నియమించుకొన్నట్లు పేర్కొన్నాయి.

సాధారణంగా శిక్షణ తీసుకుని ఉగ్రవాదిగా మారినవారికి క్రిమినల్‌ రికార్డు ఉంటుంది. అందువల్ల వారి కార్యకలాపాలను ట్రాక్‌ చేసే అవకాశం ఉంటుంది. కానీ.. ఇటీవల జరిగిన అనేక లక్షిత హత్యల్లో నిందితులు హైబ్రీడ్‌ ఉగ్రవాదులే అని తేలింది. వీరంతా స్థానిక యువకులే కావడంతో పాటు గతంలో నేరాలు చేసినట్లు ఎలాంటి రికార్డులు లేవు. దీంతో వీరిని గుర్తించడం కష్టంగా మారిందని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ఒక్క మే నెలలోనే కనీసం 12 మంది యువకులు ఉగ్రవాదానికి ఆకర్షితులై ముఠాలో చేరినట్లు సమాచారం. వీరిలో నలుగురిని ఇటీవల పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేశారు. ‘‘ పిస్టోల్‌ ఇప్పుడు కొత్త పాపులర్‌ ఆయుధంగా మారింది. ఉగ్రవాద సంస్థలు స్థానిక వ్యక్తులను ఆన్‌లైన్‌ ద్వారా ఆకర్షించి వారికి ఆన్‌లైన్‌లోనే శిక్షణ ఇస్తున్నారు. తమకు ఎవరు శిక్షణ ఇస్తున్నారన్నది ఆ యువకులకు తెలియదు. లక్ష్యాలను కూడా ఆన్‌లైన్‌లో నిర్దేశిస్తున్నారు. వీరు వాటిని పాటిస్తున్నారు. ఓ మధ్యవర్తి ద్వారా పిస్టోల్‌ను పంపుతున్నారు. హత్య చేసిన అనంతరం ఆ పిస్టోల్‌ను తిరిగి మధ్యవర్తికి ఇచ్చేసి వీరు తమ రోజువారీ పనులు చేసుకుంటున్నారు’’ అని పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పుడు ఇదే పోలీసులకు అత్యంత సవాల్‌గా మారింది.


 

ఐదు నెలల్లో 16 మంది బలి..

కశ్మీర్‌ లోయలో ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు 16 హత్యలు జరిగాయి. పోలీసులు, టీచర్లు, సర్పంచులతో పాటు సామన్య పౌరులు కూడా ముష్కరుల కాల్పులకు బలయ్యారు. 1990 నాటి ఊచకోత తర్వాత వలస వెళ్లిన కశ్మీరీ పండితులను తిరిగి లోయకు తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే ప్రధానమంత్రి ప్రత్యేక పునరావాస ప్యాకేజీ కింద 4వేల మంది వలస కశ్మీరీ పండితులు, వందలాది మంది హిందూ ఉద్యోగులను ఎస్సీ కోటాలో ఉద్యోగాలిచ్చి కశ్మీర్‌ లోయలో నియమించింది. వీరికి ఆర్థిక ప్యాకేజీలు కూడా ప్రకటించింది. దీంతో చాలా మంది తిరిగి కశ్మీర్‌ లోయకు వచ్చి ఉద్యోగాలు చేస్తున్నారు.

అయితే ఇటీవల గత కొన్ని నెలలుగా వీరిని లక్ష్యంగా చేసుకుని మళ్లీ దాడులు జరగడం జరుగుతుండటం గమనార్హం. గతేడాది ఫిబ్రవరిలో శ్రీనగర్‌కు చెందిన ఓ ప్రముఖ దాబా యజమాని కుమారుడిని ముష్కరులు తన రెస్టారెంట్లోనే కాల్చి చంపారు. ఆ తర్వాత అదే ఏడాది అక్టోబరులో ప్రముఖ కెమిస్ట్‌ ఎంల్‌ బింద్రోను ఉగ్రవాదులు దారుణంగా హత్య చేశారు. ఇది జరిగిన రెండు రోజులకే ఓ ప్రభుత్వ పాఠశాలలో ప్రిన్సిపల్‌, మరో టీచర్‌ ముష్కరుల కాల్పులకు బలయ్యారు.

ఇక ఈ ఏడాది మార్చిలో కశ్మీరీ పండిట్‌ ఉద్యోగి రాహుల్‌ భట్‌ ప్రభుత్వ కార్యాలయంలో విధులు నిర్వహిస్తుండగా.. ఉగ్రవాదులు కాల్చి చంపారు. దీంతో కశ్మీరీ పండితులు, అల్పసంఖ్యాక వర్గాల్లో మళ్లీ భయం మొదలైంది. రాహుల్ హత్య తర్వాత తమకు రక్షణ కల్పించాలంటూ వీధుల్లోకి చేరి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. ఓ వైపు వీరి నిరసనలు కొనసాగుతుండగానే దాడులు పెరిగాయి. మొన్న జమ్మూకు చెందిన ఓ ఉపాధ్యాయురాలు, నిన్న రాజస్థాన్‌కు చెందిన ఓ బ్యాంకు మేనేజర్‌, ఆ తర్వాత ఓ వలసకూలీని ముష్కరులు పొట్టనబెట్టుకున్నారు. గత 22 రోజుల్లోనే 9 హత్యలు జరగ్గా.. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 16 మంది ముష్కరుల కాల్పులకు బలయ్యారు.

1990ల కంటే ప్రమాదకరంగా..

వరుస ఘటనలతో కశ్మీరీ పండితులు మళ్లీ వలసలే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘‘ఈ రోజు కశ్మీర్‌లో పరిస్థితులు 1990ల కంటే ప్రమాదకరంగా ఉన్నాయి. కనీసం భద్రతా సిబ్బందికే రక్షణ లేదు. అలాంటప్పుడు సామాన్య పౌరుల పరిస్థితి ఏంటీ? హత్యలకు భయపడి ఇప్పుడు మళ్లీ అనేక కుటుంబాలు వలసలు వెళ్లాల్సిన పరిస్థితి తలెత్తింది’’ అని కశ్మీరీ పండిత్‌ ఉద్యోగి ఒకరు ఆవేదన చెందారు. ఇప్పటి వరకు 65 కుటుంబాలు లోయను విడిచి వెళ్లినట్లు సమాచారం. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని