Monkey Pox: మంకీపాక్స్‌ అలర్ట్‌.. దేశంలో రెండో కేసు నమోదు

ప్రపంచ దేశాలను కలవరపెడుతోన్న మంకీపాక్స్‌(Monkeypox)భారత్‌ను ఆందోళనకు గురిచేస్తోంది. తాజాగా కేరళలో రెండో కేసు నమోదైంది.

Published : 18 Jul 2022 16:50 IST

తిరువనంతపురం: ప్రపంచదేశాలను కలవరపెడుతోన్న మంకీపాక్స్‌(Monkeypox)భారత్‌ను ఆందోళనకు గురిచేస్తోంది. తాజాగా కేరళలో రెండో కేసు నమోదైంది. కన్నూర్‌ జిల్లాలో ఈ కేసు వెలుగుచూసినట్లు సోమవారం ఆ రాష్ట్ర వైద్య శాఖ ధ్రువీకరించింది.  

‘కన్నూర్‌ జిల్లాకు చెందిన 31 ఏళ్ల వ్యక్తిలో మంకీపాక్స్ బయటపడింది. ప్రస్తుతం అతడు వైద్య కళాశాలలో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్యపరిస్థితి మెరుగ్గానే ఉంది. ఆ వ్యక్తితో సన్నిహితంగా మెలిగినవారిపై దృష్టిసారించాం’ అని ఆరోగ్య మంత్రి వీణా జార్జ్‌ వెల్లడించారు. ఇది దేశవ్యాప్తంగా రెండో మంకీపాక్స్ కేసు. ఈ వ్యక్తి జులై 13న దుబాయ్‌ నుంచి బయలుదేరి కర్ణాటకలోని మంగళూరు విమానాశ్రయంలో దిగారు. తర్వాత లక్షణాలు కనిపించడంతో.. ఆసుపత్రిలో చేరారు. అతడి నమూనాలను ఎన్‌ఐవీ పుణెకు పంపగా.. తాజాగా పాజిటివ్‌గా తేలిందని అధికారులు చెప్పారు. 

ఇదిలా ఉండగా.. ఇటీవల యూఏఈ నుంచి వచ్చిన కొల్లాంకు చెందిన వ్యక్తిలో మొదటిసారి ఈ వైరస్‌ను గుర్తించారు. సదరు వ్యక్తి యూఏఈలో మంకీపాక్స్ సోకిన వ్యక్తితో సన్నిహితంగా మెలగడంతో దీని బారినపడ్డారు. ఆ వెంటనే కేంద్రం అప్రమత్తమైంది. కేరళ వైద్య సిబ్బందికి సహకరించే నిమిత్తం గత వారం కేంద్ర ఆరోగ్య శాఖ ఉన్నతస్థాయి బృందాన్ని పంపింది. 

ఏంటీ వైరస్‌..

మంకీపాక్స్ ఒక వైరల్‌ వ్యాధి. ఇది కూడా స్మాల్‌పాక్స్‌ కుటుంబానికి చెందినదే. జంతువుల నుంచి మనుషులకు సోకుతుంది. సాధారణంగా మధ్య, పశ్చిమ ఆఫ్రికాల్లో ఈ వైరస్‌ అధికంగా వ్యాపిస్తుంటుంది. తుంపర్ల ద్వారా, లేదా వ్యాధి సోకిన వ్యక్తికి అతి దగ్గరం ఉండటం వల్ల ఇది ఇతరులకు వ్యాపించే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. ఇది శరీరంలోకి పూర్తిగా వ్యాప్తి చెందడానికి సాధారణంగా 6 నుంచి 13 రోజులు పడుతుంది. ఒక్కోసారి 5 నుంచి 21 రోజుల సమయం కూడా పడుతుందని నిపుణులు వెల్లడించారు. ఈ వైరస్‌ను 1958లో మొదటిసారిగా కోతుల్లో గుర్తించారు. అందుకే మంకీపాక్స్ అని పేరుపెట్టారు. ఆ తర్వాత 1970ల్లో తొలిసారి మనుషుల్లో ఇది బయటపడింది. సాధారణంగా ఎలుకలు, చుంచు, ఉడతల నుంచి ఈ వ్యాధి అధికంగా వ్యాపిస్తున్నట్లు పరిశోధనలు చెబుతున్నాయి.

లక్షణాలు ఏంటి..

జ్వరం, తలనొప్పి, వాపు, నడుంనొప్పి, కండరాల నొప్పి, అలసట వంటివి మంకీపాక్స్ ​లక్షణాలు. స్మాల్‌పాక్స్‌ మాదిరిగానే ముఖం, చేతులు, కాళ్లపై దద్దుర్లు, బొబ్బలు ఏర్పడతాయి. ఒక్కోసారి శరీరమంతా వచ్చే అవకాశం కూడా ఉంటుందట. ఈ లక్షణాలు 14-21 రోజుల్లో బయటపడతాయి. మైల్డ్​ కేసుల్లో లక్షణాలు కనిపించకపోవచ్చు. ఈ వ్యాధి సోకిన వారిలో చాలా మంది వారాల్లోనే కోలుకుంటారు. అయితే 10 మందిలో ఒకరికి ఇది ప్రాణాంతకంగా మారే ప్రమాదం కూడా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని