Corona Virus: సెకండ్‌ వేవ్‌ మధ్యలో ఉన్నాం.. వచ్చే రెండు నెలలే అత్యంత కీలకం: కేంద్రం

ప్రస్తుతం 3.33లక్షల క్రియాశీల కేసులు ఉండగా.. వాటిలో లక్షన్నర మందికి పైగా కేరళలోనే ఉన్నాయన్నారు. నాలుగు రాష్ట్రాల్లో 10 వేల నుంచి లక్ష మధ్య ఉండగా.. 31 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లో మాత్రం 10వేల కన్నా తక్కువ ఉన్నట్టు వివరించారు. దేశంలోని 41 జిల్లాల్లో వీక్లీ పాజిటివిటీ రేటు 10శాతం కన్నా ఎక్కువగానే.....

Updated : 26 Aug 2021 17:52 IST

దిల్లీ:  దేశంలో ప్రస్తుతం కరోనా సెకండ్‌ వేవ్‌ కొనసాగుతోందని కేంద్రం హెచ్చరించింది. సెప్టెంబర్‌, అక్టోబర్‌ మాసాల్లో అనేక పండుగలు ఉండటంతో కరోనా నియంత్రణలో ఆ రెండు నెలలే అత్యంత కీలకమని తెలిపింది. ప్రజలంతా తగిన జాగ్రత్తలతో పండుగలు జరుపుకోవాలని విజ్ఞప్తి చేసింది. దేశంలో కొవిడ్‌ పరిస్థితులపై కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులు మీడియాతో మాట్లాడారు. వ్యాక్సిన్లు వ్యాధి నుంచి రక్షణ మాత్రమే కల్పిస్తాయని, అందువల్ల వ్యాక్సినేషన్‌ తర్వాతా ప్రతిఒక్కరూ మాస్క్‌లు తప్పనిసరిగా వాడాలని విజ్ఞప్తి చేశారు. దేశవ్యాప్తంగా గత వారంలో నమోదైన మొత్తం కొవిడ్‌ కేసుల్లో 58.4శాతం ఒక్క కేరళలోనే నమోదైనట్టు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం దేశంలో 3.33లక్షల క్రియాశీల కేసులు ఉండగా.. వాటిలో లక్షన్నరకు పైగా కేరళలోనే ఉన్నాయన్నారు. ఏపీ సహా నాలుగు రాష్ట్రాల్లో 10 వేలు నుంచి లక్ష మధ్య ఉండగా.. 31 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లో మాత్రం 10వేల కన్నా తక్కువ ఉన్నట్టు వివరించారు. దేశంలోని 41 జిల్లాల్లో వీక్లీ పాజిటివిటీ రేటు 10శాతం కన్నా ఎక్కువగానే ఉందని తెలిపారు.

సెకండ్‌ వేవ్‌ మధ్యలో ఉన్నాం..

దేశం కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ మధ్యలో ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ అన్నారు. నిన్న నమోదైన 46వేల కొత్త కేసుల్లో దాదాపు 58శాతం కేరళలోనే వెలుగుచూసినట్టు ఆయన వెల్లడించారు. మిగతా రాష్ట్రాల్లో మాత్రం కొవిడ్‌ తగ్గుదల ట్రెండ్‌ కనబడుతోందన్నారు. దేశంలోని మొత్తం క్రియాశీల కేసుల్లో ఒక్క కేరళ రాష్ట్రంలోనే 1,70,829 (51.19%) ఉండగా.. మహారాష్ట్రలో 53,695 (16.01%), కర్ణాటక 19,344 (5.8%), తమిళనాడు 18,352 (5.5%), ఆంధ్రప్రదేశ్‌లో 14,061 (4.21%)గా ఉన్నట్టు వివరించారు. అలాగే, 24గంటల వ్యవధిలో 80లక్షల డోసులు పంపిణీ చేసినట్టు తెలిపారు. జూన్‌ తొలి వారంలో 100కి పైగా కేసులు 279 జిల్లాల్లో నమోదవ్వగా.. ప్రస్తుతం ఆ సంఖ్య 41 జిల్లాలకు చేరిందని తెలిపారు. రికవరీ రేటు పెరుగుతోందని, ప్రస్తుతం 97శాతానికి పైగా ఉన్నట్టు పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని