G20 Logo: జీ 20 లోగోలో ‘కమలం’.. కాంగ్రెస్ విమర్శలకు భాజపా సెటైర్

ప్రపంచంలో శక్తిమంతమైన కూటమిగా పేరుగాంచిన జీ-20 పాలనా పగ్గాలను డిసెంబరు 1న ఇండోనేషియా నుంచి భారత్‌ స్వీకరించనుంది. ఈ సమావేశం ఈ నెల 15-16 తేదీల్లో ఇండోనేషియాలోని బాలిలో జరగనుంది.

Published : 09 Nov 2022 17:45 IST

దిల్లీ: మనదేశం జీ-20 కూటమి అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన లోగో విమర్శలకు దారితీసింది. ఆ లోగోలో కమలం పువ్వు చిహ్నం ఉండడాన్ని కాంగ్రెస్‌ తప్పుపట్టింది. భాజపా పార్టీ గుర్తు కూడా కమలమే కావడంతో లోగో తీర్చిదిద్దిన తీరుపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.

‘70 సంవత్సరాల క్రితం జవహర్‌లాల్ నెహ్రూ కాంగ్రెస్ జెండాను జాతీయ జెండాగా మార్చాలనే ప్రతిపాదనను తిరస్కరించారు. కానీ ఇప్పుడు భాజపా ఎన్నికల గుర్తు.. భారత్‌ జీ20 అధ్యక్ష పదవికి అధికారిక చిహ్నంగా మారింది. ఈ తీరు ఎంతో దిగ్భ్రాంతికి గురిచేసింది. అయినా, తమ గురించి ప్రచారం చేసుకునే విషయంలో మోదీ, భాజపా ఎంతవరకైనా వెళ్తారని మాకు తెలుసు’ అంటూ జైరాం రమేశ్‌ విమర్శించారు. దీనిపై కమలం పార్టీ అంతే ఘాటుగా బదులిచ్చింది.

‘ఈ కమలం మన జాతీయ పుష్పం. సాక్షాత్తు మహాలక్ష్మి అమ్మవారి ఆసనం. మీరు మన జాతీయ పుష్పాన్ని వ్యతిరేకిస్తున్నారా..? కమల్‌ నాథ్‌ పేరు నుంచి కమలాన్ని తీసేయగలరా..? ఇంకోవిషయం రాజీవ్‌కున్న అర్థం కూడా కమలమే!’ అంటూ కాంగ్రెస్‌ ఆరోపణలను తోసిపుచ్చింది. జీ-20 కూటమికి భారత్‌ నేతృత్వానికి సంబంధించి లోగోను, ఇతివృత్తాన్ని, వెబ్‌సైట్‌ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ మంగళవారం దిల్లీలో ఆవిష్కరించారు.

ప్రపంచంలో శక్తిమంతమైన కూటమిగా పేరుగాంచిన జీ-20 పాలనా పగ్గాలను డిసెంబరు 1న ఇండోనేషియా నుంచి భారత్‌ స్వీకరించనుంది. ఈ కూటమిలో అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్‌, కెనడా, చైనా, ఫ్రాన్స్‌, జర్మనీ, ఇండియా, ఇండోనేషియా, ఇటలీ, జపాన్‌, రిపబ్లిక్‌ ఆఫ్‌ కొరియా, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, టర్కీ, అమెరికా, ఐరోపా సమాజం(యూరోపియన్‌ యూనియన్‌) సభ్యదేశాలుగా ఉన్నాయి. ఈ సమావేశం ఈ నెల 15-16 తేదీల్లో ఇండోనేషియాలోని బాలిలో జరగనుంది. దీనికి మనదేశం నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరుకానున్నారు. వచ్చే ఏడాది సమావేశాన్ని మనదేశంలో నిర్వహించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని