Chenab bridge: మేఘాల పల్లకిలో.. మైమరిపించే వంతెన.. మనోహర దృశ్యం చూశారా..!

పాల సంద్రమే పరవళ్లు పెడుతోందా! నీలి మబ్బులే పల్లకిగా మారేనా!! అన్నట్లుగా కన్పిస్తోంది కదా ఈ చిత్రం. ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెన చినాబ్‌ బ్రిడ్జీపై

Published : 09 Feb 2022 11:55 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: పాల సంద్రమే పరవళ్లు పెడుతోందా! నీలి మబ్బులే పల్లకిగా మారేనా!! అన్నట్లుగా కన్పిస్తోంది కదా ఈ చిత్రం. ప్రపంచంలోనే ఎత్తయిన రైల్వే వంతెన చినాబ్‌ బ్రిడ్జీపై ఆవిష్కృతమైంది ఈ ముగ్ధ మనోహర దృశ్యం. 

జమ్మూకశ్మీర్‌లోని రియాసీ జిల్లాలో చినాబ్‌ నదిపై ప్రపంచంలోనే అతి ఎత్తయిన రైల్వే వంతెన నిర్మాణం చేపడుతోన్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టులో కీలక దశ అయిన ప్రధాన ఆర్చి నిర్మాణం ఇటీవలే పూర్తయ్యింది. ఇంజినీరింగ్‌ అద్భుతంగా అభివర్ణించే ఈ రైల్వే వంతెన ఆర్చిని ఇటీవల దట్టమైన మేఘాలు అలుముకోవడంతో ఈ సుందర దృశ్యం కన్పించింది. ఈ చిత్రాలను కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌, భాజపా సీనియర్‌ నేత సాంబిత్‌ పాత్రా సోషల్‌మీడియాలో పంచుకున్నారు. వీటిని చూసిన నెటిజన్లు అబ్బురపడుతున్నారు. 

నదీ గర్భం నుంచి 359 మీటర్ల ఎత్తులో నిర్మిస్తోన్న ఈ వంతెన.. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన రైల్వే వంతెనగా గుర్తింపు సాధించనుంది. ఇప్పటివరకు చైనాలోని బెయిపాన్‌ నదిపై ఉన్న షుబాయ్‌ రైల్వే వంతెన(275 మీటర్లు) పేరుతో ఉన్న ప్రపంచ రికార్డును ఇది అధిగమించనుంది. పారిస్‌లోని ప్రఖ్యాత ఐఫిల్‌ టవర్‌తో పోలిస్తే దీని ఎత్తు 30 మీటర్లు ఎక్కువ కావడం విశేషం. దీని పొడవు 1315 మీటర్లు. 

రైలు మార్గం ద్వారా కశ్మీర్‌ను భారత్‌లోని మిగతా ప్రాంతాలతో అనుసంధానించేందుకు రూ.28వేల కోట్లతో చేపట్టిన ఉధంపుర్‌-శ్రీనగర్‌-బారాముల్లా రైల్వే ప్రాజెక్టులో ఇది భాగం. ఈ వంతెన నిర్మాణానికి రూ.1250 కోట్లు ఖర్చవనున్నట్లు అంచనా వేస్తున్నారు. ప్రధాన ఆర్చి నిర్మాణం పూర్తవ్వగా.. ప్రస్తుతం ఆర్చి ఎగువన నిర్మాణాలను చేపట్టారు. అవి పూర్తయి.. రైలు పట్టాలను వేస్తే వంతెన పూర్తవుతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని