దిల్లీ కారు ప్రమాద మృతురాలి ఇంట్లో చోరీ.. స్నేహితురాలిపైనే అనుమానాలు..!

దిల్లీ కారు ప్రమాద ఘటనలో మృతిచెందిన అంజలీ సింగ్‌ నివాసంలో దొంగతనం జరగడం కలకలం రేపుతోంది. ఈ చోరీ వెనుక ఆమె స్నేహితురాలి హస్తం ఉండొచ్చని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.

Published : 09 Jan 2023 16:50 IST

దిల్లీ: దేశ రాజధాని దిల్లీ (Delhi)లో యువతిని కారుతో ఢీకొట్టి ఈడ్చుకెళ్లిన ఘటన (Car Horror)లో దర్యాప్తు కొనసాగుతోంది. అయితే, ఇదే సమయంలో మృతురాలు అంజలీ సింగ్‌ (Anjali Singh) ఇంట్లో చోరీ జరగడం కలకలం రేపుతోంది. ఆదివారం రాత్రి తమ నివాసంలోకి కొందరు ఆగంతకులు చొరబడి విలువైన వస్తువులను ఎత్తుకెళ్లినట్లు అంజలి కుటుంబసభ్యులు ఆరోపించారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఘటన సమయంలో ఇంట్లో ఎవరూ లేరట. ‘‘ఈ ఉదయం పొరుగింటి వారు ఫోన్‌ చేసి చోరీ గురించి మాకు సమాచారమిచ్చారు. మేం ఇంటికి వెళ్లి చూసేసరికి తాళం పగలగొట్టి ఉంది. ఎల్‌సీడీ టీవీ, ఇతర వస్తువులు, బెడ్‌ కింద దాచిపెట్టిన కొన్ని విలువైన వస్తువులు కన్పించట్లేదు’’ అని అంజలి (Anjali Singh) సోదరి మీడియాకు తెలిపారు. దీని వెనుక అంజలి స్నేహితురాలు నిధి హస్తం ఉండొచ్చని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేశామని, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

నూతన సంవత్సరం వేళ ద్విచక్రవాహనంపై వెళ్తున్న అంజలి సింగ్‌ ఓ కారు బలంగా ఢీకొట్టి.. 20 కిలోమీటర్ల ఈడ్చుకెళ్లిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో అంజలి (Anjali Singh) శరీరం ఛిద్రమైంది. అయితే ఘటన సమయంలో అంజలితో పాటు ఆమె స్నేహితురాలు నిధి కూడా ఉన్నట్లు ఆ తర్వాత బయటికొచ్చింది. ప్రమాదం చూసి తాను భయపడిపోయాయని, అందుకే పోలీసులకు చెప్పలేదని నిధి తెలిపింది. అంతేగాక, అంజలి మద్యం సేవించి ద్విచక్రవాహనం నడిపినట్లు ఆరోపించింది.

అయితే, ఈ ఆరోపణలను అంజలి కుటుంబసభ్యులు ఖండించారు. మృతురాలి పోస్టుమార్టం నివేదికలోనూ మద్యం సేవించినట్లు ఆధారాల్లేకపోవడంతో నిధి వ్యాఖ్యలపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీనిపై పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. గతంలో ఓ డ్రగ్స్‌ కేసులో నిధి నిందితురాలిగా ఉండటం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని