
UN: ఉగ్రవాదానికి భారత్ బాధిత దేశం
ఐక్యరాజ్యసమితిలో పాక్‌పై పరోక్ష విమర్శలు
న్యూయార్క్: ఉగ్రవాదానికి భారత్ బాధిత దేశం అని ఐక్యరాజ్యసమితికి భారత్ వెల్లడించింది. ముఖ్యంగా సరిహద్దుల అవతలవైపు నుంచి ఉగ్రవాద సమస్య ఎక్కువ పొంచిఉందని.. ఉగ్రవాదులకు ఆర్థిక సాయాన్ని అడ్డుకోవడంపై ఐరాసలో జరిగిన ఉన్నత స్ధాయి సమావేశంలో వివరించింది. గత కొన్ని దశాబ్దాలుగా కొన్ని దేశాలు ఉగ్రవాదులకు ఆర్థిక సాయం, వారి కార్యకలాపాలకు మద్దతు ఇవ్వడంలో దోషులుగా ఉన్నాయని పరోక్షంగా పాకిస్థాన్‌పై విమర్శలు గుప్పించింది.
ఆయా దేశాలు ఉగ్రవాదులకు సురక్షిత ప్రదేశాలుగా మారాయని ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత రాయబారి టీఎస్ తిరుమూర్తి ఆరోపించారు. ఉగ్రవాదంపై పోరాటంలో విజయం సాధించాలంటే.. మిలిటెంట్లకు ఆర్థిక సాయం దక్కకుండా చేయడం కీలకమని పేర్కొన్నారు. ఉగ్రవాదులకు ఆర్థిక సాయాన్ని అడ్డుకోవడంలో కొన్ని దేశాలకు చట్టపరమైన వ్యవస్ధలు అందుబాటులో లేకుండా ఉంటే, మరికొన్ని దేశాలు మాత్రం ఉద్దేశపూర్వకంగానే వారికి సాయం చేస్తున్నాయని తిరుమూర్తి విమర్శించారు. మిలిటెంట్లకు ఆర్థిక సాయం చేసే దేశాలను అంతర్జాతీయ సమాజం ఏకమై జవాబుదారీగా చేయాలని సూచించారు.