Railway Board: గూడ్స్ రైలులో ఇనుప ఖనిజం.. ప్రమాద తీవ్రతకు అదీ ఓ కారణమే : రైల్వే బోర్డు
సిగ్నలింగ్‌లో సమస్య కారణంగా ఒడిశా రైలు ప్రమాదం చోటుచేసుకున్నట్లు ప్రాథమికంగా తేలిందని రైల్వే బోర్డు (Railway Board) తెలిపింది. గూడ్స్ రైలులో ఇనుప ఖనిజం ఉన్నందున.. దాన్ని ఢీకొన్న కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌పై తీవ్ర ప్రభావం పడినట్లు వెల్లడించింది.
దిల్లీ: ఒడిశాలో రైలు ప్రమాదం (Odisha Train Accident) తీరని విషాదాన్ని మిగిల్చిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఇప్పటివరకు 275 మంది మృతి చెందారు. ఈ క్రమంలోనే రైలు ప్రమాదంపై రైల్వే బోర్డు (Railway Board) స్పందించింది. సిగ్నలింగ్ (Signalling)లో సమస్య కారణంగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు ప్రాథమికంగా తేలిందని వెల్లడించింది. అయితే, దీనిపై రైల్వే సేఫ్టీ కమిషనర్ (Commissioner of Railway Safety) నుంచి పూర్తిస్థాయి నివేదిక రావాల్సి ఉందని తెలిపింది. ఈ ఘటనలో కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ (Coromandel Express) మాత్రమే ప్రమాదానికి గురయినట్లు, ఆ సమయంలో దాని వేగం దాదాపు గంటకు 128 కి.మీలుగా ఉన్నట్లు పేర్కొంది. గూడ్స్ రైలులో ఇనుప ఖనిజం ఉండటంతో.. ప్రమాద తీవ్రత పెరిగిందని చెప్పింది.
‘ఈ ఘటనలో గూడ్స్ రైలు పట్టాలు తప్పలేదు. లూప్ లైన్‌లో ఆగి ఉన్న ఆ గూడ్స్ రైలులో ఇనుప ఖనిజం ఉంది. దాన్ని కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ వేగంగా ఢీకొట్టడంతో.. బోగీలపై తీవ్ర ప్రభావం పడింది. ఇది భారీ సంఖ్యలో మరణాలు, గాయాలకు దారితీసింది. ఈ క్రమంలోనే ‘కోరమాండల్’ బోగీలు చెల్లాచెదురై డౌన్‌లైన్‌లోకి వచ్చి పడ్డాయి. అదే సమయంలో డౌన్‌లైన్‌లో గంటకు 126 కి.మీ వేగంతో వెళ్తోన్న బెంగళూరు- హావ్‌డా రైలు చివరి రెండు బోగీలను ఢీకొట్టాయి’ అని రైల్వే బోర్డు (ఆపరేషన్ అండ్ బిజినెస్ డెవలప్‌మెంట్) సభ్యురాలు జయవర్మ సిన్హా వెల్లడించారు. ఈ రెండు రైళ్ల వేగ పరిమితి గంటకు 130 కి.మీలు అని, ఈ నేపథ్యంలో ఇక్కడ అతి వేగం ప్రమాదానికి కారణం కాదన్నారు. ‘కవచ్’ వ్యవస్థ ఉన్నప్పటికీ.. ఇటువంటి ప్రమాదాన్ని నివారించడంలో దోహదపడదని చెప్పారు. బాధిత కుటుంబీకులు హెల్ప్‌లైన్ నంబర్ 139ను సంప్రదించవచ్చని సూచించారు. వారి ప్రయాణం, ఇతర ఖర్చులు భరిస్తామని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.