
JK: కశ్మీర్ లోయలో చాలా భయంగా ఉంది.. అందుకే ఊరికి పోతున్నాం!
శ్రీనగర్: కశ్మీర్ లోయలో వరుస ఉగ్రదాడులతో అక్కడి స్థానికేతరుల్లో భయానక వాతావరణం నెలకొంది. కశ్మీర్ పౌరులతో పాటు ఉపాధి కోసం పొట్టచేతబట్టుకొని వలస వచ్చిన కూలీలను సైతం ఉగ్రమూకలు చంపేస్తుండటంతో అంతా హడలిపోతున్నారు. దీంతో అక్కడ చావలేక, బతకలేని పరిస్థితుల్లో అనేకమంది వలస కూలీలు బిక్కుబిక్కుమంటూ స్వస్థలాలకు పయనమవుతున్నారు. ఈ క్రమంలో రైళ్ల కోసం రాత్రంతా రైల్వే స్టేషన్ల వద్ద ఆరుబయటే గడుపుతున్న దృశ్యాలు కనబడుతున్నాయి. సోమవారం అర్ధరాత్రి కూడా దాదాపు 50మందికి పైగా వలస కూలీలు రైల్వే నౌగామ్ రైల్వే స్టేషన్ వద్దకు చేరుకున్నారు. వారిలో అనేకమంది బూద్గామ్ జిల్లా సమీపంలో ఇసుకబట్టీల్లో పనిచేసే బిహార్‌కు చెందినవారే ఉన్నారు.
కశ్మీర్లో పరిస్థితిపై మిథిలేశ్ కుమార్ అనే వ్యక్తి మాట్లాడుతూ.. ‘‘రాత్రంతా ఇలా ఆరుబయటే ఉన్నాం. భద్రతా బలగాలు రైల్వేస్టేషన్ వద్ద పహారా ఉండటంతో మేం చాలా ధైర్యంగా ఉండగలిగాం. సాధారణంగా మేం వెళ్లాల్సిన గడువు కన్నా ముందే కశ్మీర్‌ను వదిలి సొంతూళ్లకు పోతున్నాం. ఇక్కడ చాలా భయమేస్తోంది’’ అన్నారు. ‘‘ఎవరూ మమ్మల్ని వెళ్లిపోమని చెప్పలేదు.. కానీ మాలో ఎవరినైనా చంపేస్తే బాధ్యత ఎవరిది? కొంత సమయంపాటు మాకు భద్రత కల్పించగలరేమో కానీ ఆ తర్వాత మా పరిస్థితి ఏంటి?’’ అని బిహార్‌లోని మదుభనికి చెందిన దీపక్ కుమార్ అనే మరోవ్యక్తి తన ఆవేదన వ్యక్తంచేశారు. కశ్మీర్ ప్రజలు మంచివారే.. కానీ కొందరు మాత్రం రాజకీయాలు చేస్తున్నారన్నారు.
మరోవైపు, జమ్మూకశ్మీర్‌లోని ఇతర ప్రాంతాల్లోనూ వలస కూలీలు టాక్సీలు, బస్సుల్లో తరలిపోతున్నట్టు సమాచారం. మరోవైపు, పనికోసం వెతికే క్రమంలో పలు చోట్ల భారీ సంఖ్యలో వలసకూలీలు కనబడుతున్నారు. తమ రాష్ట్రానికి చెందిన వలస కూలీలు హత్యకు గురవుతుండటంతో బిహార్ సీఎం నీతీశ్‌కుమార్ నిన్న స్పందించారు. ఇలాంటి ఘటనలు భయం సృష్టిస్తున్నాయన్నారు. జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాతో మాట్లాడిన ఆయన.. సీనియర్ బిహార్ అధికారులు అక్కడి అధికారులతో టచ్‌లో ఉన్నారని నీతీశ్ చెప్పారు.