India-Canada: తీవ్రవాదులకు స్వర్గధామంగా కెనడా: భారత విదేశాంగ శాఖ ధ్వజం

India-Canada Diplomatic Row: భారత్‌పై కెనడా చేసిన ఆరోపణలు రాజకీయ ప్రేరేపితమేనని కేంద్ర విదేశాంగ శాఖ దుయ్యబట్టింది. ఇక కెనడియన్లకు వీసా సర్వీసుల నిలిపివేతను కూడా కేంద్రం ధ్రువీకరించింది.

Updated : 21 Sep 2023 17:20 IST

దిల్లీ: ఖలిస్థానీ అంశంపై కెనడా (Canada) వ్యవహరిస్తున్న తీరును భారత్‌ (India) మరోసారి తీవ్రంగా తప్పుబట్టింది. ఆ దేశం తీవ్రవాదులు, అతివాదులకు స్వర్గధామంగా మారిందని ధ్వజమెత్తింది. ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రికత్తలు నెలకొన్న వేళ.. కేంద్ర విదేశాంగ శాఖ (MEA) అధికార ప్రతినిధి అరీందమ్‌ బాగ్చి (Arindam Bagchi) ఈ వ్యవహారంపై గురువారం మీడియాతో మాట్లాడారు. ఖలిస్థానీ సానుభూతిపరుడు హర్‌దీప్‌ సింగ్‌ నిజ్జర్ హత్య వెనుక భారత్‌ హస్తం ఉండొచ్చని కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో చేసిన ఆరోపణలు.. రాజకీయ ప్రేరేపితమేనని దుయ్యబట్టారు. ఇక, భద్రతాపరమైన పరిస్థితుల కారణంగానే కెనడియన్లకు వీసా సర్వీసులను నిలిపివేసినట్లు ధ్రువీకరించారు. (India Canada Diplomatic Row)

‘‘భారత్‌పై కెనడా చేసిన ఆరోపణలు రాజకీయ ప్రేరేపితమేనని అనిపిస్తోంది. హర్‌దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ ఘటన గురించి ఆ దేశం ఎలాంటి అధికారిక సమాచారం ఇవ్వలేదు. కానీ, కెనడా గడ్డపై జరుగుతున్న నేరపూరిత కార్యకలాపాలు, వ్యతిరేక శక్తులకు సంబంధించి అన్ని ఆధారాలను ఆ దేశానికి ఇచ్చాం. గత కొన్నేళ్లుగా దాదాపు 20-25 మంది వ్యక్తులను మన దేశానికి అప్పగించాలని కెనడాను కోరాం. అయితే, అటు వైపు నుంచి ఎలాంటి స్పందనా లేదు. మన డిమాండ్లపై కెనడా ఎలాంటి చర్యలు చేపట్టలేదు. ఆ దేశం వ్యవస్థీకృత నేరాలకు అడ్డాగా మారుతోంది. తీవ్రవాదులు, అతివాదులకు స్వర్గధామంగా ఉంటోంది. అంతర్జాతీయంగా పోతున్న పరువు గురించి కెనడా ఆలోచించుకోవాలి’’ అని బాగ్చి దుయ్యబట్టారు.

భారత్‌తో విభేదాలు.. ఆ ‘ఐదు కళ్ల’నే నమ్ముకొన్న ట్రూడో..!

అందుకే వీసా సర్వీసుల నిలిపివేత..

‘‘ఆ దేశంలో మన హైకమిషన్లు, కాన్సులేట్లను లక్ష్యంగా చేసుకుని బెదిరింపులు పెరుగుతున్నాయి. ఈ పరిణామాలు సాధారణ కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తున్నాయి. భద్రతాపరమైన ఉద్రిక్తతల కారణంగానే కెనడియన్ల వీసా దరఖాస్తులను ప్రక్రియలను హైకమిషన్లు, కాన్సులేట్లు పూర్తిచేయలేకపోతున్నాయి. అందుకే, అన్ని రకాల వీసాల జారీలను నిలిపివేశాం. ఇతర దేశాల నుంచి దరఖాస్తులు చేసుకునే కెనడియన్లకు కూడా వీసాలు ఇవ్వలేం. కెనడియన్లు భారత్‌కు రాకుండా అడ్డుకోవాలనేది మా విధానం కాదు. సరైన వీసాలతో (సస్పెన్షన్‌ ఉత్తర్వులకు ముందు జారీ అయిన వీసాలు) వారు ఎప్పుడైనా ఇండియాకు రావొచ్చు. కానీ, ఆ దేశంలోని పరిస్థితులు మన హైకమిషన్‌ కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తున్నాయి’’ అని బాగ్చి వివరించారు.

మన అంతర్గత వ్యవహారాల్లో కెనడా జోక్యం..

‘‘కెనడాలో ఉన్న మన దౌత్యవేత్తల కంటే.. భారత్‌లో ఆ దేశ దౌత్యవేత్తల సంఖ్య చాలా ఎక్కువ. ఈ విషయంలో ఇరు దేశాల మధ్య సమానత్వం ఉండాలి. అంతేగాక, భారత అంతర్గత వ్యవహారాల్లో కెనడా దౌత్యవేత్తలు జోక్యం చేసుకుంటున్నారు. కెనడా తమ దౌత్య సిబ్బందిని తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. ఇక, మన దేశంలో ఉన్న విదేశీ దౌత్యవేత్తలకు పూర్తి భద్రత కల్పిస్తున్నాం. కెనడా కూడా మన దౌత్యవేత్తల భద్రత పట్ల అంతే నిబద్ధతతో ఉండాలని మేం కోరుతున్నాం’’ అని బాగ్చి వెల్లడించారు.

ఇక, ట్రూడో ఆరోపణలను ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లామని, ఆయన వాటిని తోసిపుచ్చారని తెలిపారు. కెనడాలోని భారత పౌరులకు అడ్వైజరీ జారీ చేశామని, ఎలాంటి సమస్య ఎదురైనా వారు కాన్సులేట్‌ను సంప్రదించొచ్చని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని