Updated : 30 Jun 2022 14:51 IST

ఈ సీఎంలు.. బల ‘పరీక్ష’ ముందే తప్పుకున్నారు..!

ఇంటర్నెట్‌ డెస్క్‌: మహారాష్ట్ర రాజకీయ సంక్షోభానికి తెరదించుతూ ముఖ్యమంత్రి పీఠం నుంచి దిగిపోయారు శివసేన అధినేత ఉద్ధవ్‌ ఠాక్రే. అసమ్మతి ఎమ్మెల్యేలను బుజ్జగించడంలో విఫలమై.. సభలో మెజార్టీ నిరూపించుకోలేని అశక్తుడై.. విశ్వాస పరీక్షకు ముందే సీఎం పదవికి రాజీనామా చేశారు. అయితే గతంలోనూ పలు ముఖ్యమంత్రులు సంక్షోభ పరిస్థితులు ఎదురైనప్పుడు బలపరీక్షకు వెళ్లకుండా వైదొలిగిన సందర్భాలున్నాయి.

విశ్వాస పరీక్షకు ముందే రాజీనామా చేసిన సీఎంలు ఎవరెవరంటే..

కమల్‌నాథ్‌.. 2018 నవంబరులో జరిగిన మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం రాలేదు. దీంతో అతిపెద్ద పార్టీగా అవతరించిన కాంగ్రెస్‌.. ఎస్పీ, బీఎస్పీ, స్వతంత్రుల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కమల్‌నాథ్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. అయితే ఈ ప్రభుత్వం రెండేళ్లు కూడా నిలబడలేదు.  2020 మార్చిలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత  జ్యోతిరాదిత్య సింధియా తిరుగుబాటుతో కమల్‌నాథ్‌ ప్రభుత్వం సంక్షోభంలో పడింది. సింధియాతో పాటు మరో 22 మంది ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేశారు. దీంతో సర్కారు మైనార్టీలో పడింది. కమల్‌నాథ్‌ మెజార్టీ నిరూపించుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే కాంగ్రెస్‌కు సరిపడా సంఖ్యాబలం లేకపోవడంతో విశ్వాస పరీక్షలో నెగ్గలేమని భావించిన కమల్‌నాథ్‌ సీఎం పదవికి రాజీనామా చేశారు. అనంతరం శివరాజ్‌ సింగ్‌ చౌహన్‌ నేతృత్వంలో భాజపా ప్రభుత్వం ఏర్పాటైంది.

ఫడణవీస్‌.. 2019 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో అనేక నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లోనూ ఏ పార్టీకి మెజార్టీ రాలేదు. అయితే ఎన్సీపీకి చెందిన అజిత్‌ పవార్‌ వర్గం భాజపాకు మద్దతిస్తామని ప్రకటించింది. దీంతో దేవేంద్ర ఫడణవీస్‌ నేతృత్వంలో భాజపా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. సీఎంగా ఫడణవీస్‌, డిప్యూటీ సీఎంగా అజిత్‌ పవార్‌ ప్రమాణస్వీకారం కూడా చేశారు. అయితే ఏం జరిగిందో తెలియదు గానీ.. ఆ మరుసటి రోజే పవార్ తన పదవికి రాజీనామా చేశారు. దీంతో మెజార్టీ కోల్పోయిన ఫడణవీస్‌.. బలపరీక్షకు వెళ్లకుండానే రాజీనామా చేశారు. ఆ తర్వాత శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ మహా వికాస్‌ అఘాడీ కూటమిగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. తాజాగా ఈ కూటమికి వ్యతిరేకంగా శివసేన నేత ఏక్‌నాథ్‌ శిందే తిరుగుబాటు చేశారు. దీంతో మైనార్టీలో పడిన ఉద్ధవ్‌ ఠాక్రే.. సీఎం పీఠం నుంచి దిగిపోయారు.

యడియూరప్ప.. 2018 మే నెలలో కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన భాజపా నేత బీఎస్‌ యడియూరప్ప రెండు రోజుల తర్వాత తన పదవికి రాజీనామా చేశారు. ఆ ఏడాది జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా అతిపెద్ద పార్టీగా అవతరించింది. స్వతంత్రుల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. ఇందుకు గవర్నర్‌ ఆమోదించడంతో యడ్డీ సీఎంగా ప్రమాణం చేశారు. అయితే భాజపాకు సంఖ్యా బలం లేదని కాంగ్రెస్‌ ఆరోపించింది. జేడీఎస్‌తో కలిసి తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని గవర్నర్‌ను సంప్రదించింది. ఈ క్రమంలోనే యడియూరప్ప బలపరీక్షను ఎదుర్కోవాలని గవర్నర్ ఆదేశించింది. అయితే మెజార్టీకి అవసరమైన ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టడంలో విఫలమైన యడ్డీ.. బలపరీక్షకు ముందే రాజీనామా చేశారు.

నబం టుకీ.. 2016 ఫిబ్రవరిలో అరుణాచల్ ప్రదేశ్‌లో రాజకీయ సంక్షోభం తలెత్తి..  ఏడాదంతా అనిశ్చితి నెలకొంది. రాష్ట్రపతి పాలన విధింపు, కొందరు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడంతో ఈ వ్యవహారమంతా సుప్రీంకోర్టుకు చేరింది. అయితే ఎమ్మెల్యేల అనర్హతను సుప్రీంకోర్టు కొట్టివేయడంతో నబం టుకి మళ్లీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. అదే సమయంలో తనకు మద్దతుగా ఉన్న ఎమ్మెల్యేలతో కలిసి పెమా ఖండూ గవర్నర్‌ను కలిశారు. తమకు మెజార్టీ ఉందని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని కోరారు. దీంతో నబం టుకీ అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకోవాలని గవర్నర్‌ ఆదేశించారు. కానీ సరైన సంఖ్యా బలం లేదని గ్రహించిన టుకీ.. విశ్వాస పరీక్షకు కొద్ది గంటల ముందు సీఎం పదవికి రాజీనామా చేశారు. 

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని