Mehul Choksi: ఆమె రమ్మంటేనే వెళ్లా..! 

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు కుంభకోణం ప్రధాన నిందితుడు, వజ్రాల వ్యాపారి మెహుల్‌ ఛోక్సీ అరెస్టు వ్యవహారం పూటకో మలుపు తిరుగుతూ హాలీవుడ్‌ సినిమాను తలపిస్తోంది. ఛోక్సీ

Published : 07 Jun 2021 17:57 IST

ఆంటిగ్వా: పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు కుంభకోణం ప్రధాన నిందితుడు, వజ్రాల వ్యాపారి మెహుల్‌ ఛోక్సీ అరెస్టు వ్యవహారం పూటకో మలుపు తిరుగుతూ హాలీవుడ్‌ సినిమాను తలపిస్తోంది. ఛోక్సీ తనంతట తాను డొమినికా వెళ్లలేదని, కిడ్నాప్‌ చేశారని ఆయన తరఫు న్యాయవాదులు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఛోక్సీ కూడా ఇదే విషయాన్ని పేర్కొంటూ ఆంటిగ్వా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా తన గర్ల్‌ఫ్రెండ్ వివరాలను కూడా ఆయన వెల్లడించారు. 

‘‘బార్బరా జబారికాతో గత ఏడాది కాలంగా నాకు స్నేహం ఉంది. మే 23న ఆమె నాకు ఫోన్‌ చేసి ఇంటికొచ్చి పికప్‌ చేసుకోమ్మని చెప్పింది. నేను వెళ్లేసరికి ఎనిమిది, పది మంది నలువైపుల నుంచి వచ్చి నాపై దాడి చేశారు. దారుణంగా కొట్టారు. అప్పుడు నాకు జబారికా సాయం చేయలేదు సరికదా.. కనీసం కాపాడే ప్రయత్నం కూడా చేయలేదు. జబారికా ప్రవర్తించిన తీరు చూస్తుంటే ఆమె కూడా కిడ్నాప్‌ కుట్రలో భాగంగానే అన్పిస్తోంది. వారు కొట్టడంతో నాకు స్పృహ తప్పినట్లుగా అయ్యింది. వారు నా ఫోన్‌ , వాచ్‌, వాలెట్‌ అన్నీ తీసుకున్నారు. ఆ తర్వాత దొంగతనానికి రాలేదని చెప్పి డబ్బు తిరిగిచ్చారు’’ అని ఛోక్సీ తన ఫిర్యాదులో పేర్కొన్నట్లు ప్రముఖ వార్తా సంస్థ ఏఎన్‌ఐ తన కథనంలో వెల్లడించింది. 

ఛోక్సీ పత్రాలు విసిరేయడం నిజమే..

మరోవైపు ఛోక్సీ అరెస్టుపై ప్రత్యక్ష సాక్షులు సంచలన విషయాలు చెబుతున్నారు. రొసెవు తీరంలో ఛోక్సీ సముద్రంలోకి పత్రాలు విసిరేయడం నిజమేనని వారు అంటున్నారు. ‘‘ఆ రోజు సాయంత్రం ఒక వ్యక్తి సముద్రంలోకి పత్రాలు విసిరేస్తూ కన్పించాడు. విధుల్లో ఉన్న పోలీసులు చూసి ఆయన దగ్గరకు వెళ్తుండగా అతడు పరిగెత్తడం ప్రారంభించాడు. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు ఆయనను వెంబడించారు. రెండు సార్లు పడిలేచి పరిగెత్తిన ఆ వ్యక్తి చివరకు పోలీసులకు చిక్కాడు’’అని డొమినికా వ్యక్తి ఒకరు అక్కడి మీడియాకు తెలిపారు. బహుశా ఆ సమయంలోనే ఛోక్సీకి గాయమై ఉంటుందని అన్నారు. 

కాగా.. పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాతే అతడు ఛోక్సీ అని, ఆయనపై ఇంటర్‌పోల్‌ రెడ్‌కార్నర్‌ నోటీసు జారీ అయ్యిందనే విషయం తెలిసిందట. ఇదంతా చూస్తుంటే ఛోక్సీ క్యూబాకు పారిపోయేందుకే డొమినికా వచ్చి ఉంటాడని స్థానిక కథనాలు పేర్కొంటున్నాయి. తన ప్రయత్నం బెడిసికొట్టడంతో కిడ్నాప్‌ డ్రామాకు తెరతీశాడేమో అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని