Updated : 10 Sep 2021 13:45 IST

Kim Jong-Un: అవును.. మీరు చూస్తోంది ఉత్తర కొరియా కిమ్‌నే!

సైనిక కవాతులో స్లిమ్‌గా కనిపించిన కిమ్‌

ప్యాంగ్యాంగ్‌: ఉత్తర కొరియా అధినేత కిమ్‌ జోంగ్ పాలన గురించి ఎంత చర్చ ఉంటుందో ఆయన శరీర బరువు, లుక్స్‌కి సంబంధించి అంతే చర్చ జరుగుతుంటుంది. అందరి రాజకీయ నేతల్లా కాకుండా అప్పుడప్పుడు తళుక్కున మెరుస్తుంటారు ఆయన. బాహ్య ప్రపంచానికి దూరంగా ఉండే కిమ్‌ ఎప్పుడు బయటకి వచ్చినా సరే అంతర్జాతీయ మీడియా కవరేజీ ఇస్తుంది. ప్రజలూ అంతే ఆసక్తిగా వాటిని ఫాలో అవుతారు. తాజాగా ఉత్తర కొరియాలో జరిగిన సైనిక కవాతులో పాల్గొన్న కిమ్‌ మరి కాస్త స్లిమ్‌గా మారి అందరి దృష్టిని తనవైపు తిప్పుకొన్నారు. అంతేకాదు.. ఆయన తాత, ఉత్తర కొరియా వ్యవస్థాపకుడు, మాజీ ఉత్తర కొరియా అధినేత కిమ్‌ ఇల్‌ సుంగ్‌ హెయిర్‌ స్టైల్‌లో కనిపించి ఆయన్ను గుర్తుచేశారు.

అవకాశం దొరికిన ప్రతిసారీ అణ్వాయుధ బలాన్ని ప్రదర్శించి ఆసియా దేశాలు, అమెరికాకు సవాళ్లు విసిరే అలవాటున్న అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌.. ఈ దఫా మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించారు. ఈసారి సైనిక కవాతులో ఎలాంటి భారీ ఆయుధాలు ప్రదర్శించకపోవడం గమనార్హం. గురువారం అక్కడి జాతీయ మీడియా ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేయగా.. సూట్‌లో కనిపించారు కిమ్‌. పొరుగు దేశం దక్షిణ కొరియా కిమ్‌ ఆరోగ్యానికి సంబంధించి ఎప్పడికప్పుడు అప్‌డేట్స్‌ ఇచ్చే విషయంలో ముందుంటుంది. 2011లో అధికార పగ్గాలు చేపట్టిన కిమ్ ఏటా 6-7 కిలోల బరువు పెరగ్గా.. దక్షిణ కొరియా నిఘా వర్గాలు ఇచ్చిన నివేదికల్లో కిమ్‌ సుమారు 140 కిలోల బరువు ఉన్నట్లు సమాచారం. ఈఏడాది జులైలో కిమ్‌ సన్నబడినట్లు కనిపించగా.. ఆ తర్వాత అదే తీరును కొనసాగిస్తూ వచ్చారు.

ఎప్పుడు ఆగ్రహానికి చిరునామాగా నిలిచే కిమ్‌ ఈ కార్యక్రమంలో.. ఎలాంటి ప్రసంగాలు చేయలేదు. ప్యాంగ్యాంగ్‌లోని సెంట్రల్ కిమ్ ఇల్ సంగ్ స్క్వేర్‌ ముందు భద్రతా దళాలు గంటకు పైగా కవాతు చేస్తూ కనిపించగా.. ఇద్దరు పిల్లలు ఆయనను స్వాగతించిన దృశ్యాల్లో నవ్వుతూ ముందుకుసాగారు. కిమ్‌... సుమారు 20కిలోలు బరువు తగ్గినట్లు దక్షిణ కొరియా శాసనసభ్యుడు ఒకరు జులైలో చెప్పగా.. ఇప్పుడు మరింత సన్నగా కనిపించి ఆకట్టుకున్నారు. చెయిన్‌ స్మోకరైన కిమ్‌.. బరువు తగ్గడంతో పాటు పొగతాగడం మానేసినట్లు అప్పట్లోనే వార్తలు వచ్చాయి.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని