Corona: ఇలా అయితే..థర్డ్‌ వేవ్‌ అనివార్యం!

కరోనా రెండో దశ ఉద్ధృతి నేపథ్యంలో దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్ వల్ల వైరస్ వ్యాప్తి అదుపులోకి వచ్చిన సూచనలు ఇప్పుడిప్పుడే కనిపిస్తున్నాయి. ఈ తరుణంలో రాష్ట్రాలన్నీ ఆంక్షల్ని సరళతరం చేస్తుండడంతో ప్రజల మళ్లీ.....

Updated : 20 Jun 2021 10:13 IST

హెచ్చరించిన ఎయిమ్స్‌ డైరెక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా

దిల్లీ: కరోనా రెండో దశ ఉద్ధృతి నేపథ్యంలో దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్ వల్ల వైరస్ వ్యాప్తి అదుపులోకి వచ్చిన సంకేతాలు ఇప్పుడిప్పుడే కనిపిస్తున్నాయి. ఈ తరుణంలో రాష్ట్రాలన్నీ ఆంక్షల్ని సరళతరం చేస్తుండడంతో ప్రజల మళ్లీ యథావిధిగా రోడ్లపైకి, మార్కెట్లలోకి వచ్చేస్తున్నారు. దీంతో ఆయా ప్రాంతాల్లో రద్దీ పెరుగుతోంది. ఈ పరిస్థితులపై దిల్లీ ఎయిమ్స్ చీఫ్‌ రణ్‌దీప్‌ గులేరియా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలు కరోనా కట్టడి నిబంధనల్ని విస్మరిస్తే థర్డ్‌ వేవ్‌ అనివార్యమని హెచ్చరించారు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే ఆరు నుంచి ఎనిమిది వారాల్లో కరోనా మూడో వేవ్‌ విజృంభణ ప్రారంభమవుతుందని అంచనా వేశారు. ఓ ప్రముఖ జాతీయ మీడియా ఛానెల్‌లో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

ఇక మహమ్మారి కట్టడికి వ్యాక్సిన్‌ ఒక్కటే ఆయుధమని గులేరియా పునరుద్ఘాటించారు. అలాగే ఎక్కువ మందికి టీకాను చేరవేసే క్రమంలో భాగంగా కొవిషీల్డ్‌ టీకా రెండు డోసుల మధ్య వ్యవధిని పెంచడం తప్పుడు విధానమేమీ కాదని అభిప్రాయపడ్డారు. కరోనా కట్టడి నిబంధనల్ని తప్పనిసరిగా పాటించడంతో పాటు హాట్‌స్పాట్‌లపై గట్టి నిఘా పెట్టడం ద్వారా మహమ్మారిని నియంత్రించవచ్చని తెలిపారు. లేదంటే వైరస్ వ్యాప్తి పెరిగి కొత్త మ్యూటేషన్లు  వస్తాయని హెచ్చరించారు. కొత్త వేరియంట్లపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 

రెండు వేవ్‌ల మధ్య వ్యవధి కూడా తగ్గిపోవడం ఆందోళన కలిగిస్తోందన్నారు. వైరస్ వ్యాప్తి వేగం కూడా క్రమంగా పెరుగుతోందని తెలిపారు. అలాగే డెల్టా ప్లస్ వేరియంట్‌పై ఇంకా అధ్యయనం జరగాల్సి ఉందన్నారు. ఈ మేరకు జన్యుక్రమ విశ్లేషణ జరిపే మౌలిక వసతుల్ని వచ్చే కొన్ని వారాల్లో భారీగా పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని