Third wave: ఈ నెలాఖరుకు గరిష్ఠ కేసులు.. మార్చి మధ్యనాటికి ముగింపు

రోజురోజుకు పెరుగుతున్న కొవిడ్ కేసులతో దేశంలో మూడో వేవ్‌ మొదలైనట్లేనని వైద్య నిపుణులు చెబుతోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే జనవరి నెలాఖరుకు దేశంలో కేసుల సంఖ్య గరిష్ఠ స్థాయి(పీక్‌)కి చేరుకుంటుందని ఐఐటీ కాన్పుర్‌ ప్రొఫెసర్‌ మణీంద్ర అగర్వాల్‌...

Updated : 10 Jan 2022 16:39 IST

ఐఐటీ కాన్పుర్‌ ప్రొఫెసర్‌ అంచనా

ఇంటర్నెట్‌ డెస్క్‌: రోజురోజుకు పెరుగుతున్న కొవిడ్ కేసులతో దేశంలో మూడో వేవ్‌ మొదలైనట్లేనని వైద్య నిపుణులు చెబుతోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే జనవరి నెలాఖరుకు దేశంలో కేసుల సంఖ్య గరిష్ఠ స్థాయి(పీక్‌)కి చేరుకుంటుందని ఐఐటీ కాన్పుర్‌ ప్రొఫెసర్‌ మణీంద్ర అగర్వాల్‌ తాజాగా వెల్లడించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. పీక్‌ సమయంలో నమోదయ్యే కేసులు.. సెకండ్‌ వేవ్‌ ఉద్ధృత దశలో బయటపడిన కేసుల సంఖ్యనూ మించే అవకాశం ఉందని తెలిపారు. వారానికి సగటున నాలుగు నుంచి ఎనిమిది లక్షల కేసులు వస్తాయని అంచనా వేశారు. ఈసారి గరిష్ఠ స్థాయి చాలా త్వరగా వస్తున్నందునే.. కేసుల పెరుగుదల తీవ్రంగా ఉందని వివరించారు. అనంతరం కేసుల తగ్గుదల కూడా అంతే వేగంగా ఉంటుందని భావిస్తున్నామన్నారు. ఒకవేళ జనవరి చివర్లో గరిష్ఠ స్థాయి నమోదైతే.. మార్చి మధ్య నాటికి ఈ వేవ్‌ ముగుస్తుందని చెప్పారు.

మహానగరాల్లో కరోనా పరిస్థితులపై ప్రొ.అగర్వాల్ మాట్లాడుతూ.. దిల్లీలో జనవరి మధ్య నాటికి గరిష్ఠ స్థాయి నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఆ సమయంలో రోజుకు దాదాపు 40 వేల కేసులు బయటపడతాయని అంచనా వేశారు. ముంబయి, కోల్‌కతాలోనూ ఈ నెల మధ్యనాటికి గరిష్ఠ కేసులు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. అయితే.. నెలాఖరుకు ఈ నగరాల్లో ప్రస్తుత వేవ్ దాదాపు ముగుస్తుందన్నారు. ఎన్నికల ర్యాలీలపై మాట్లాడుతూ.. ‘కేవలం ఈ కార్యక్రమాలను మాత్రమే వైరస్‌ వ్యాప్తికి కారణంగా భావిస్తే.. అది తప్పు. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి. అందులో ఈ ర్యాలీలు ఒకటి. వీటిని నిరోధించడం ద్వారా.. మహమ్మారి వ్యాప్తిని కట్టడి చేయగలమని అనుకోవడం కరెక్ట్‌ కాదు’ అని స్పష్టం చేశారు. దేశంలో కరోనా వ్యాప్తిని ట్రాక్ చేసే ‘సూత్ర కంప్యూటర్ మోడల్‌’కు ప్రొ.అగర్వాల్ నేతృత్వం వహిస్తున్నారు. గణిత సూత్రాల ఆధారంగా కేసులను అంచనా వేస్తుంటారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని