Delhi temperature: దిల్లీలో కోల్డ్‌ స్పెల్‌.. 23 ఏళ్లలో ఇది మూడోసారి!

జనవరి 3 నుంచి 9 మధ్య కాలంలో దిల్లీలో రోజువారీ ఉష్ణోగ్రతలు 2 డిగ్రీల నుంచి 4 డిగ్రీల మధ్య నమోదైనట్లు ఐఎండీ వెల్లడించింది గత 23 ఏళ్లలో ఇలా జరగడం ఇది మూడోసారి.

Published : 10 Jan 2023 22:09 IST

దిల్లీ: దేశ రాజధాని దిల్లీ (Delhi)ని చలి గజగజ వణికిస్తోంది. ఎన్నడూ లేనంతగా ఉష్ణోగ్రతలు (Temparature) పడిపోతున్నాయి. దిల్లీ, రాజధాని పరిసర ప్రాంతాల్లో జనవరి 3 నుంచి 9 మధ్య కాలంలో (Cold Spell) ఐదు రోజుల పాటు 2 డిగ్రీల నుంచి 4 డిగ్రీల సరాసరి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వరుసగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైన నిర్దిష్ట కాలాన్ని కోల్డ్‌ స్పెల్‌గా పరిగణిస్తారు. గత 23 ఏళ్లలో ఇంతటి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఇది మోడోసారి అని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. గతంలో 2006 సంవత్సరంలో ఏర్పడిన కోల్డ్‌ స్పెల్‌లో అత్యల్పంగా 1.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాగా.. 2013లోనూ ఇలాంటి పరిస్థితులే ఎదురైనట్లు ఐఎండీ వెల్లడించింది.

మరోవైపు దిల్లీ పరిసర ప్రాంతాల్లో జనవరి 12న మంచుతోపాటు కొన్ని చోట్ల వర్షం కురిసే సూచనలు ఉన్నాయని ఐఎండీ వెల్లడించింది. అరేబియా సముద్రం మీదుగా వీస్తున్న పశ్చిమగాలుల వల్ల జనవరి 14 తర్వాత మరోసారి కోల్డ్‌స్పెల్‌ ఏర్పడే అవకాశాలున్నాయని ఐఎండీ సైంటిస్ట్‌ ఆర్‌కే జెనమని పేర్కొన్నారు. హిమాచల్‌ ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌లో జనవరి 11-14 మధ్య వర్షసూచన ఉన్నట్లు ఆయన చెప్పారు. ‘‘హిమాచల్‌ ప్రదేశ్‌, జమ్ముకశ్మీర్‌తోపాటు హిమాలయ వాయువ్య ప్రాంతాల్లో మరోసారి కోల్డ్‌ స్పెల్‌ పరిస్థితులు ఏర్పడే అవకాశాలున్నాయి. మరోవైపు పశ్చిమవైపు నుంచి వీస్తున్న గాలులు యాక్టివ్‌గా ఉన్నందున జనవరి 14 నుంచి కొన్ని రోజులపాటు కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముంది’’ అని పేర్కొన్నారు. ఈ గాలుల ప్రభావం ఉత్తర్‌ప్రదేశ్‌, బిహార్‌ రాష్ట్రాలపైనా ఉంటుందని చెప్పారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని