Skyup Airlines: హై హీల్స్‌.. స్కర్టులకు చెల్లు.. మీ సౌకర్యమే ముఖ్యం

హై హీల్స్‌.. పెన్సిల్‌ స్కర్ట్‌.. టైట్‌ డ్రెస్‌.. దాదాపు అన్ని విమాన సర్వీసుల్లో క్రూ క్యాబిన్‌ మహిళా ఉద్యోగుల ఆహార్యం ఇది. విధులకు బయలుదేరినప్పటినుంచి తిరిగి వచ్చేవరకు ఇదే యూనిఫాం. కానీ, ఈ క్రమంలో వారు ఇబ్బందులు పడుతున్నారని గుర్తించిందో విమానయాన సంస్థ. ఈ క్రమంలో తమ...

Published : 06 Oct 2021 01:42 IST

మహిళా సిబ్బందికి ఓ ఎయిర్‌లైన్స్‌ కానుక!

ఇంటర్నెట్‌ డెస్క్‌: హై హీల్స్‌.. పెన్సిల్‌ స్కర్ట్‌.. టైట్‌ డ్రెస్‌.. దాదాపు అన్ని విమాన సర్వీసుల్లో క్రూ క్యాబిన్‌ మహిళా ఉద్యోగుల ఆహార్యం ఇది. విధులకు బయలుదేరినప్పటినుంచి తిరిగి వచ్చేవరకు ఇదే యూనిఫాం. కానీ, ఈ క్రమంలో వారు ఇబ్బందులు పడుతున్నారని గుర్తించిందో విమానయాన సంస్థ. ఈ క్రమంలో తమ మహిళా సిబ్బందికి ఈ రకమైన సంప్రదాయ వస్త్రధారణ నుంచి విముక్తి కల్పించింది. అదే ఉక్రెయిన్‌కు చెందిన ‘స్కైఅప్‌’ ఎయిర్‌లైన్స్‌. 2016లో ఏర్పాటైన ఈ సంస్థ..  స్థానికంగా తక్కువ ఛార్జీలతో ప్రయాణ సౌకర్యం అందించే విమానయాన సంస్థల్లో ఒకటిగా నిలిచింది. 

సర్వే నిర్వహించి..

యూనిఫాం విషయంలో సంస్థ మొదటగా తమ మహిళా సిబ్బందిని సర్వే చేసింది. ఈ క్రమంలో వారంతా హై హీల్స్, పెన్సిల్ స్కర్ట్స్, టైట్‌ డ్రెస్సులతో విసిగిపోయినట్లు గుర్తించింది. ‘విధులు, సెక్యూరిటీ చెకింగ్‌, రాకపోకలు.. ఇలా రోజుకు 12 గంటల పాటు యూనిఫాంలోనే ఉండాలి. ఇంతసేపు హీల్స్‌ ధరించడంతో.. ఆ తర్వాత నడవడానికి ఇబ్బంది అవుతోంది. సరిగ్గా ఊపిరి పీల్చుకునేందుకు సౌకర్యంగా లేని ఈ డ్రెస్సింగ్‌తో ఆరోగ్య సమస్యలూ వస్తున్నాయి. తోటి ఉద్యోగుల్లో చాలామంది తరచూ వైద్యుల వద్దకు వెళ్తున్నారు. దీంతోపాటు విమానంలో అత్యవసర సమయాల్లో పరిగెత్తాల్సి ఉంటుంది. పైకి ఎక్కాల్సి ఉంటుంది. స్కర్టు ధరించి ఎలా చేయగలం’ అంటూ వారినుంచి వచ్చిన ఆవేదనలను అర్థం చేసుకుంది. ఈ క్రమంలోనే వారికి సౌకర్యంగా ఉండేలా.. హీల్స్‌ బదులు స్నీకర్‌లు, స్కర్ట్, టైట్‌ బ్లౌజుల బదులు ట్రౌజర్‌ సూట్‌లు ధరించే అవకాశం కల్పించనుంది.

కాలం మారింది.. మహిళలూ మారారు..

ఈ క్రమంలో సంస్థ ‘స్కైఅప్‌ ఛాంపియన్‌’ పేరిట సరికొత్త యూనిఫాంను రూపొందించింది. ఇందులో సౌకర్యవంతమైన స్నీకర్స్‌, మృదువైన ట్రౌజర్ సూట్లు అందుబాటులో ఉంచింది. ఈ కొత్త యూనిఫాం రూపొందించడానికి ముందు సంస్థ.. 1930ల ప్రారంభం నుంచి ఆయా సంస్థ క్యాబిన్ క్రూ ధరిస్తూ వచ్చిన యూనిఫామ్‌లను అధ్యయనం చేయడం గమనార్హం. ‘కాలం మారింది. మహిళలూ మారారు. కాబట్టి, సంప్రదాయ వస్త్రధారణ, హీల్స్, రెడ్ లిప్‌స్టిక్‌.. ఇవి కాదు. ఇందుకు భిన్నంగా.. కొత్తగా, మరింత ఆధునికంగా, సౌకర్యవంతమైన యూనిఫాం అవసరం’ అని స్కైఅప్ ఎయిర్‌లైన్స్ హెడ్ మరియనా గ్రిగోరాష్ అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని