Corona: చూయింగ్‌ గమ్‌తో కరోనా వైరస్‌కు అడ్డుకట్ట!

కరోనా భయాలు ప్రజలను వెంటాడుతూనే ఉన్నాయి. తాజాగా దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన వేరియంట్‌ అత్యంత ప్రమాదకరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. దీంతో కరోనాను అడ్డుకునేందుకు ప్రస్తుత వ్యాక్సిన్ల సమర్థతను పరీక్షించడమేకాకుండా.. అనేక పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే యూనివర్సిటీ

Published : 02 Dec 2021 01:20 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా భయాలు ప్రజలను వెంటాడుతూనే ఉన్నాయి. తాజాగా దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన వేరియంట్‌ అత్యంత ప్రమాదకరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత వ్యాక్సిన్ల సమర్థతపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వీటిని మరింత అభివృద్ధి పర్చాల్సి రావొచ్చని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు కరోనాని నిర్మూలించేందుకు అనేక పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే యూనివర్సిటీ ఆఫ్‌ పెన్సిల్వేనియా పరిశోధకులు కొత్త రకం చూయింగ్‌ గమ్‌ను ఆవిష్కరించారు. ఈ చూయింగ్‌ గమ్‌ ద్వారా శరీరంలోకి చేరే కరోనా వైరస్‌ లోడ్‌ను తగ్గించే అవకాశముందని, తద్వారా వైరస్‌ సంక్రమణ తీవ్రతను తగ్గించొచ్చని పరిశోధకులు చెబుతున్నారు. 

నోట్లో ఉండే లాలాజలంలో కరోనా లోడ్‌ ఎక్కువగా ఉంటుంది. ఎవరైనా దగ్గినా, తుమ్మినా వారి నోటి నుంచి వచ్చే తుంపర్ల ద్వారా కరోనా వైరస్‌ ఇతరులకు వ్యాప్తిస్తుందన్న విషయం తెలిసిందే. అందుకే, లాలాజలంలో ఉండే కరోనా లోడ్‌ను తగ్గించడమే లక్ష్యంగా పరిశోధకులు ఈ చూయింగ్‌ గమ్‌ను సృష్టించారు. ఏసీఈ2 అనే ప్రోటీన్‌తో చూయింగ్‌ గమ్‌ను తయారు చేశారు. ఈ ప్రోటీన్‌.. కరోనా వైరస్‌ శరీరంలోకి చొచ్చుకురావడానికి ఉపయోగించే కొమ్ములాంటి ప్రోటీన్‌. ఎప్పుడైతే ఈ ఏఈసీ2లోని గ్రాహకాలకు లాలాజలంలో ఉండే వైరస్‌ అతుక్కుపోతుందో.. అప్పుడు వైరస్‌ శరీరంలోకి ప్రవేశించే సామర్థ్యాన్ని కోల్పోతుంది. అలా ఈ చూయింగ్‌ గమ్‌తో 95శాతం వైరస్‌ లోడ్‌ను తగ్గించొచ్చని పరిశోధకులు వివరించారు. 

ఈ పరిశోధన కోసం యూనివర్సిటీ ఆఫ్‌ సెన్సిల్వేనియా.. కరోనా సోకి ఆస్పత్రిపాలైన బాధితుల నుంచి నామూనాలు సేకరించి ప్రయోగాలు చేసింది. ఈ పరిశోధనకు సంబంధించిన వివరాలు మాలిక్యూలర్‌ థెరఫీ జర్నల్‌లోనూ ప్రచురితమైయ్యాయి. వైరస్‌ల నుంచి బాధితుల్ని కాపాడటానికి ప్రోటిన్‌ను ఉపయోగించడం చాలా సులభమైన పద్ధతని, దాన్నే చూయింగ్‌ గమ్‌లో ఉపయోగించారని జర్నల్‌లో పేర్కొన్నారు. అయితే, ప్రస్తుతం ఈ చూయింగ్‌ గమ్‌ అందుబాటులో లేదు. దీనికి యూఎస్‌ డ్రగ్‌ రెగ్యులేటర్స్‌ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉందని పరిశోధకులు వెల్లడించారు.

Read latest National - International News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని