Covid Vaccine: ఈ కొవిడ్‌ టీకాను 100 డిగ్రీల వద్ద కూడా నిల్వ ఉంచొచ్చు..!

శీతలీకరణ అవసరం లేకుండా, 100 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతను కూడా తట్టుకునే శక్తిగల కరోనా టీకా భారత్‌లో అభివృద్ధి అవుతోంది.

Published : 17 Apr 2022 02:10 IST

దిల్లీ: శీతలీకరణ అవసరం లేకుండా, 100 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతను కూడా తట్టుకునే శక్తిగల కరోనా టీకా భారత్‌లో అభివృద్ధి అవుతోంది. అది డెల్టా, ఒమిక్రాన్ వంటి కొవిడ్ వేరియంట్లకు వ్యతిరేకంగా బలమైన ప్రతిస్పందన ఇచ్చిందని ఎలుకలపై జరిపిన అధ్యయనంలో వెల్లడైంది. ఈ టీకాను బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్ సైన్స్(ఐఐఎస్‌సీ), బయోటెక్ అంకుర సంస్థ మిన్వాక్స్‌ సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్నాయి. ఈ తయారీలో ఆస్ట్రేలియాకు చెందిన కామన్వెల్త్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రిసెర్చ్‌ ఆర్గనైజేషన్ కూడా పాలుపంచుకుంటోంది. 

మామూలుగా టీకాలు ప్రభావంతంగా పనిచేసేందుకు శీతలీకరణ అవసరం. శాస్త్రవేత్తల బృందం ఈ ఇబ్బందులను గుర్తించి వేడిని తట్టుకునేలా టీకాను అభివృద్ధి చేస్తోంది. దీనిని 37 డిగ్రీల సెల్సియస్ వద్ద నాలుగువారాల పాటు ఉంచొచ్చని తెలిపింది. అలాగే 100 డిగ్రీల సెల్సియస్ వద్ద 90 నిమిషాలు పాటు నిల్వ చేయొచ్చని పేర్కొంది. ఇప్పటికే మన దేశంలో టీకా కార్యక్రమంలో విరివిగా వాడిన కొవిషీల్డ్‌ను 2-8 డిగ్రీల సెల్సియస్ వద్ద భద్రపరచాలి. ఇక ఫైజర్ విషయానికి వస్తే.. దాని నిల్వకు మైనస్ 70 డిగ్రీల సెల్సియస్‌ వద్ద ప్రత్యేక కోల్డ్ స్టోరేజ్ అందుబాటులో ఉండాలి. 

అంతేగాకుండా ఎలుకల మీద జరిపిన పరిశోధనలో డెల్టా, ఒమిక్రాన్ వేరియంట్లపై ఈ టీకా సామర్థ్యాన్ని అంచనా వేశారు. ఇది బలమైన యాంటీబాడీ స్పందన ఇస్తున్నట్లు గుర్తించారు. ఆ అధ్యయనం పీర్‌ రివ్యూడ్ జర్నల్‌ వైరసెస్‌లో ప్రచురితమైంది. శీతలీకరణ అవసరం లేని ఈ టీకా అందుబాటులోకి వస్తే.. అల్పాదాయ దేశాలకు ప్రయోజనకారిగా ఉండనుంది. ఇప్పటివరకూ ప్రపంచవ్యాప్తంగా 10 బిలియన్ల టీకా డోసులు పంపిణీ అయ్యాయి. అందులో 51 దేశాలు 70 శాతం జనాభాకు టీకాలు ఇచ్చాయి. అదే అల్పాదాయ దేశాల్లో అది 11 శాతంగానే ఉంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని