Free mobile: స్మార్ట్‌ఫోన్‌ ఫ్రీ.. మూడేళ్లు ఇంటర్నెట్‌ ఫ్రీ.. ఆ రాష్ట్ర సర్కార్‌ కొత్త స్కీమ్‌!

రాజస్థాన్‌లోని అశోక్‌ గహ్లోత్‌ ప్రభుత్వం కొత్త స్కీమ్‌తో ముందు కొచ్చింది. రాష్ట్రంలోని 1.35 కోట్ల మంది మహిళలకు ఉచితంగా సెల్‌ఫోన్లు ఇవ్వాలని నిర్ణయించింది.

Published : 20 Aug 2022 01:37 IST

జయపుర: రాజస్థాన్‌లోని అశోక్‌ గహ్లోత్‌ ప్రభుత్వం కొత్త స్కీమ్‌తో ముందు కొచ్చింది. రాష్ట్రంలోని 1.35 కోట్ల మంది మహిళలకు ఉచితంగా సెల్‌ఫోన్లు ఇవ్వాలని నిర్ణయించింది. మూడేళ్ల పాటు ఉచితంగా ఇంటర్నెట్‌, ఇతర సేవలను కూడా అందించనుంది. ఈ ప్రాజెక్ట్‌ కోసం మొత్తం రూ.12వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. తాజాగా ఈ సేవలను అందించేందుకు టెలికాం సంస్థల నుంచి అక్కడి యంత్రాంగం బిడ్లను ఆహ్వానించింది. ఈ నెలాఖరుకల్లా బిడ్లను ఖరారు చేయనున్నారు. వచ్చే ఏడాది ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ‘ఉచిత’ స్కీమ్‌కు శ్రీకారం చుట్టింది.

ముఖ్యమంత్రి డిజిటల్‌ సేవా యోజన పథకాన్ని ఈ ఏడాది బడ్జెట్‌లోనే ప్రకటించారు. తాజాగా దీనికి సంబంధించిన విధివిధానాలు, టెండర్ల ప్రక్రియను ప్రారంభించారు. చిరంజీవి హెల్త్‌ ఇన్సూరెన్స్‌ స్కీమ్‌ పేరిట ఆ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఆరోగ్య బీమా పథకంలో చేరిన కుటుంబాల్లోని మహిళలకు ఈ ఫోన్లు అందిస్తారు. 1.35 కోట్లుగా ఈ లెక్క తేల్చారు. వీరికి ఉచిత స్మార్ట్‌ఫోన్‌తో పాటు, మూడేళ్ల పాటు ఉచితంగా ఇంటర్నెట్‌ సదుపాయం కూడా కల్పిస్తారు. ఇందులో మొదటి సిమ్‌కార్డు లాక్‌ చేసి ఉంటుంది. రెండో సిమ్‌ స్లాట్‌లో ఇంకో సిమ్‌ కార్డు వేసుకునే వీలుంటుంది. స్మార్ట్‌ఫోన్‌, మూడేళ్ల ఇంటర్నెట్‌ కలిపి మొత్తం రూ.12వేల కోట్లు అవుతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇందుకోసం మూడు ప్రైవేటు టెలికాం కంపెనీలతో పాటు బీఎస్‌ఎన్‌ఎల్‌ కూడా పోటీ పడుతోంది. ఏ కంపెనీకి ఈ టెండర్‌ దక్కినా ఒక్కసారి 1.35 కోట్ల వినియోగదారులు వచ్చి చేరినట్లే. ఈ పండగ సీజన్‌లోనే తొలిదశ స్మార్ట్‌ఫోన్ల పంపిణీ చేపట్టాలని సర్కారు భావిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని