Taliban: ‘ఇదీ తాలిబన్‌ 2.0! మహిళలకు పూర్తిగా హక్కుల్లేవ్‌’.. వీడియో హల్‌చల్‌

అఫ్గానిస్థాన్‌లో తమ హక్కుల కోసం పలుచోట్ల రోడ్లపైకి వచ్చి గొంతెత్తుతున్న మహిళల పట్ల తాలిబన్లు తమ ప్రతాపాన్ని ప్రదర్శిస్తున్నారు. హెరాత్‌ ప్రావిన్స్‌లో రోడ్లపైకి.....

Updated : 10 Dec 2021 13:35 IST

కాబుల్‌: అఫ్గానిస్థాన్‌లో తమ హక్కుల కోసం పలుచోట్ల రోడ్లపైకి వచ్చి గొంతెత్తుతున్న మహిళల పట్ల తాలిబన్లు తమ ప్రతాపాన్ని ప్రదర్శిస్తున్నారు. హెరాత్‌ ప్రావిన్స్‌లో రోడ్లపైకి వచ్చి తమ హక్కుల కోసం నినదిస్తున్న మహిళలను అడ్డుకున్నారు. వారి నుంచి పేపర్లు లాక్కొని చింపేసిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. తాలిబన్లు సహనంతో ఉండాలని.. వారిని ఓపిగ్గా ఎదుర్కోవాలంటూ అక్కడి పౌరులు కోరుతున్నారు. అలాగే, కాబుల్‌లో పలు దుకాణాలపై ఉన్న మహిళా మోడల్స్‌ పెయింటింగ్స్‌నూ తాలిబన్లు బలవంతంగా తొలగిస్తున్నారు. ఆయా దుకాణాల యజమానులను బలవంతం చేసి షాప్‌లపై ఉన్న మోడళ్ల ప్రచార పోస్టర్లపై తెల్ల సున్నం వేస్తున్న వీడియోలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. దీంతో ‘ఇదీ తాలిబన్‌ 2.0.. మహిళలకు పూర్తిగా హక్కులు లేవు’ అంటూ పలువురు నెటిజన్లు విమర్శిస్తున్నారు.

ఆ చీకటి రాజ్యం మాకొద్దు.. ప్రభుత్వంలో మాకూ ఛాన్స్‌ ఇవ్వండి!

మరోవైపు, తాలిబన్లు హస్తగతం చేసుకున్న అఫ్గానిస్థాన్‌లో త్వరలో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. తాలిబన్ల సారథ్యంలో ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. తాలిబన్‌ ప్రభుత్వ అధినేతగా ముల్లా బరాదర్‌ పేరును ఖరారు చేసినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రెండు దశాబ్దాల క్రితం నాటి తాలిబన్ల అరాచక పాలనను గుర్తుకు తెచ్చుకొంటున్న అక్కడి మహిళలు తమ హక్కుల కోసం రోడ్డెక్కుతున్నారు. తాలిబన్ల కొత్త ప్రభుత్వంలో తమకూ అవకాశం కల్పించాలని నినదిస్తున్నారు. ఈ మేరకు పాశ్చాత్య దేశాల ప్రోత్సాహంతో తమకు లభించిన స్వేచ్ఛ, హక్కులను కాలరాయొద్దని కాబుల్‌లోని ప్రెసిడెన్షియల్‌ భవనం వద్ద డజన్ల కొద్దీ మహిళలు శుక్రవారం ఆందోళనకు దిగారు. ప్రెసిడెన్షియల్‌ భవనం ముందు ఓ గేటు వద్ద కొందరు ప్లకార్డులను ప్రదర్శిస్తూ.. మహిళలతో కూడిన సాహసోపేత కేబినెట్‌ ఏర్పాటు చేయాలని తాలిబన్లను కోరుతున్నారు. మానవ హక్కుల ప్రాధాన్యతను నొక్కి చెబుతూ.. మళ్లీ గత పాలనలోకి తాము వెళ్లాలని కోరుకోవడంలేదంటూ నినాదాలు చేస్తున్నారు. దేశ భవిష్యత్తులో మహిళలకు విద్య, సామాజిక, రాజకీయాలతో పాటు స్వేచ్ఛగా మాట్లాడే హక్కులను కల్పించాలని డిమాండ్‌ చేస్తూ కరపత్రాలను పంచుతున్నారు.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని