Gujarat: గుజరాత్‌ ఎన్నికల తేదీలను ఎందుకు ప్రకటించలేదంటే..?

గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకటించకుండా ఎలాంటి నిబంధనలు ఉల్లంఘించలేదని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.

Published : 14 Oct 2022 17:03 IST

దిల్లీ: దేశంలో మరోసారి అసెంబ్లీ ఎన్నికల సందడి మొదలైంది. హిమాచల్‌ప్రదేశ్ శాసనసభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం షెడ్యూల్‌ విడుదల చేసింది. నిజానికి ఈ రాష్ట్రంతో పాటే గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకటిస్తారని వార్తలు వచ్చాయి. అయితే అందుకు భిన్నంగా ఒక్క హిమాచల్‌కే షెడ్యూల్‌ ఖరారు చేయడం అందర్నీ ఆశ్చర్యపర్చింది. దీంతో గుజరాత్‌ ఎన్నికల తేదీలను ఎందుకు ప్రకటించలేదా? అనే అనుమానం మొదలైంది. అయితే దీనిపై ఈసీ స్పందించింది. వాతావరణ పరిస్థితుల కారణంగానే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని తెలిపింది.

సాధారణంగా రాష్ట్రాల అసెంబ్లీల పదవీకాలాలు ఆరు నెలల వ్యవధిలో ముగుస్తుంటే గనుక.. ఆ రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించి ఓట్ల లెక్కింపు కూడా ఒకే రోజున చేపడతారు. హిమాచల్‌ ప్రదేశ్ అసెంబ్లీ గడువు వచ్చే ఏడాది జనవరి 8తో ముగుస్తుండగా.. గుజరాత్‌ శాసనసభ పదవీకాలం ఫిబ్రవరి 18తో పూర్తికానుంది. దీంతో ఈ రెండు రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటిస్తారని అంతా భావించారు. అయితే నేటి షెడ్యూల్‌లో హిమాచల్‌కు మాత్రమే తేదీలు ప్రకటించడంపై మీడియా ఈసీని ప్రశ్నించింది.

దీనికి కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి రాజీవ్ కుమార్‌ స్పందిస్తూ.. ‘‘వాతావరణంతో పాటు అనేక కారణాల వల్ల హిమాచల్ ఎన్నికల తేదీలను కాస్త ముందుగా ప్రకటించాం. 2017లోనూ ఇదే సంప్రదాయం ప్రకారం ఎన్నికలు జరిగాయి. ఆ ఏడాది అక్టోబరు 13 హిమాచల్‌కు, అక్టోబరు 25న గుజరాత్‌కు షెడ్యూల్‌ ప్రకటించాం. అయితే రెండు రాష్ట్రాల ఫలితాలను మాత్రం ఒకేసారి వెల్లడించాం. ఇప్పుడు కూడా నిబంధనల ఉల్లంఘనేదీ జరగలేదు. విస్తృత చర్చల తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నాం. అంతేగాక, రెండు రాష్ట్రాల అసెంబ్లీల గడువుల మధ్య 40 రోజుల వ్యవధి ఉంది. ఒక రాష్ట్ర ఎన్నికల ఫలితాలు మరో రాష్ట్రంపై పడకుండా ఉండాలంటే కనీసం 30 రోజుల వ్యవధి ఉంటే చాలు’’ అని వివరించారు.

హిమాచల్ ప్రదేశ్‌కు నవంబరు 12న ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబరు 8న ఫలితాలను ప్రకటించనున్నట్లు ఈసీ వెల్లడించింది. పోలింగ్‌ తేదీ, కౌంటింగ్‌కు మధ్య నెల రోజులకు పైగా వ్యవధి ఉండటంతో ఈ మధ్యలోనే గుజరాత్‌ ఎన్నికలను కూడా నిర్వహించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఈ నెలలోనే షెడ్యూల్‌ విడుదలయ్యే అవకాశముంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని