Published : 15 May 2022 01:57 IST

Aarattu: విమానాలను నిలిపి.. దైవానికి దారి!

రన్‌వే నుంచి శ్రీ అనంతపద్మనాభుడి యాత్ర

ఇంటర్నెట్‌డెస్క్‌ :  తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయం... దేశంలోని అత్యంత రద్దీ విమానాశ్రయాల్లో ఒకటి..  నిత్యం విదేశాలకు వెళ్లే, వచ్చే విమానాలతో సందడిగా ఉంటుంది. అయితే ఏడాదికి రెండుసార్లు ఈ విమానాశ్రయంలో కొన్ని గంటల పాటు  రాకపోకలను నిలిపివేస్తారు.. శ్రీ అనంత పద్మనాభ స్వామి వారి ఉత్సవం సందర్భంగా ఏటా రెండు సార్లు కొన్ని గంటల పాటు ఈ ఉత్సవం జరుగుతుంది.

ఆలయం నుంచి సముద్రతీరానికి..

ప్రతి ఏటా రెండు సార్లు శ్రీ పద్మనాభ స్వామి ఆలయం నుంచి  శంకుముఖం బీచ్‌వైపు ఈ యాత్ర కొనసాగుతుంది. ఈ సందర్భంగా మార్గమధ్యంలోని విమానాశ్రయం రన్‌వేపై నుంచి ఈ ఉత్సవం నిర్వహిస్తారు. విమానాశ్రయం నిర్మించకముందు నుంచే ఈ మార్గంలోనే కొనసాగుతోంది. విమానాశ్రయం నిర్మించినా ఆ సంప్రదాయాన్ని ఇప్పటికీ కొనసాగిస్తున్నారు.

‘ఆరట్టు’ ఉత్సవం

ఆరట్టు ఉత్సవం (అభిషేకం)లో భాగంగా ఆలయ ఉత్సవాలైన పైన్‌కుని, ఆలపస్సిల సందర్భంగా ఈ పవిత్ర యాత్ర ఉంటుంది. ఈ రెండు ఉత్సవాలు ఏప్రిల్‌, అక్టోబర్‌ మాసాల్లో నిర్వహిస్తారు. సాయంత్రం 5 గంటలకు ప్రారంభమయ్యే యాత్ర రన్‌వేను 6.30 గంటలకు దాటుతుంది. ఆలయ ఏనుగులతో పాటు పురోహితులు, ట్రావెన్కూర్‌ రాజ కుటుంబీకులు పెద్ద ఎత్తున ఉత్సవంలో పాల్గొంటారు. వీరికి ముందుగానే విమానాశ్రయవర్గాలు పాస్‌లు జారీ చేస్తాయి. సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బంది నిశితంగా పరిశీలించిన అనంతరం వారిని అనుమతిస్తారు. గరుడ వాహనాన్ని అధిష్టించిన శ్రీ అనంత పద్మనాభ స్వామి భక్తులందరిపై కరుణ కురిపిస్తూ బీచ్‌కు వెళ్తారు. అనంతరం అదే మార్గంలో తిరిగి ఆలయానికి చేరుకుంటారు.

చితిర తిరుణాళ్‌ బలరామవర్మ కాలం నుంచి

ఈ విమానాశ్రయాన్ని రాజా బలరామవర్మ  పాలనాకాలంలో 1932లో నిర్మించారు. అంతకు ముందు నుంచే ఈ మార్గం నుంచే యాత్ర వెళుతుండేది. అనంతపద్మనాభ దాసులుగా ఖ్యాతి చెందిన రాజవంశం ఆ ఆనవాయితీని గౌరవిస్తూ ఏటా రెండు సార్లు జరిగే ఈ ఉత్సవం విమానాశ్రయం మీదుగా వెళ్లేందుకు అనుమతులిచ్చారు. ఇప్పటికీ ఈ సంప్రదాయం కొనసాగుతోంది.

ఐదుగంటలపాటు విమాన రాకపోకల నిలిపివేత

ఈ ఉత్సవం సందర్భంగా ఐదుగంటల పాలు అన్ని విమాన రాకపోకలను నిలిపివేస్తారు. విమానాశ్రయ అధికారులు ముందుగానే ఈ నిలిపివేతను అన్ని విమానయాన సంస్థలతో పాటు ఎయిర్‌ ట్రాఫిక్‌కు  సమాచారమిస్తారు. దీంతో అన్ని విమానాలు తమ రాకపోకలను రీషెడ్యూల్‌ చేసుకుంటాయి.

అత్యంత సంపద కలిగిన ఆలయం

శ్రీ అనంత పద్మనాభ ఆలయం ప్రపంచంలోనే అత్యంత సంపద కలిగిన ఆలయం పేరుపొందింది. కొన్నాళ్ల క్రితం ఈ ఆలయం నేలమాళిగల్లో లక్షల కోట్ల విలువ చేసే బంగారు ఆభరణాలు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ట్రావెన్కూర్‌పాలకులు ఆలయ సంపదను శతాబ్దాలుగా పరిరక్షించడంతో పాటు తాము ప్రభువులమని ఏనాడు ప్రకటించుకోలేదు. తాము పద్మనాభుడి సేవకులమని చెప్పడం వారి వినమ్రతను తెలుపుతుంది.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని