Air India: భోజనంలో రాళ్లు.. మరో వివాదంలో ఎయిరిండియా

ఎయిరిండియా (Air India) విమానంలో ఓ ప్రయాణికురాలికి వడ్డించిన భోజనంలో రాయి వచ్చింది. దీంతో మరోసారి ఈ ఎయిర్‌లైన్‌పై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Published : 10 Jan 2023 18:30 IST

దిల్లీ: విమానాల్లో ప్రయాణికులపై మూత్ర విసర్జన ఘటనలతో ఇటీవల విమర్శలను ఎదుర్కొంటోన్న ప్రముఖ విమానయాన సంస్థ ఎయిరిండియా (Air India) తాజాగా మరో వివాదంలో చిక్కుకుంది. విమానంలో వడ్డించిన భోజనంలో రాయి వచ్చిందంటూ ఓ మహిళా ప్రయాణికురాలు ఫిర్యాదు చేశారు. అందుకు సంబంధించిన ఫొటోలను ట్విటర్‌లో షేర్‌ చేస్తూ ఎయిర్‌లైన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. జనవరి 8న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఎయిరిండియా (Air India) విమానంలో తనకు ఈ చేదు అనుభవం ఎదురైనట్లు శార్వప్రియ సంగ్వాన్‌ అనే మహిళ ట్వీట్ చేశారు. ‘‘రాళ్లు లేని భోజనాన్ని అందించేందుకు ఎలాంటి వనరులు, డబ్బు అవసరం లేదు. ఎయిరిండియా విమానంలో నాకు వడ్డించిన భోజనంలో నాకు రాయి వచ్చింది. దీని గురించి సిబ్బందికి ఫిర్యాదు చేశా. ఇలాంటి నిర్లక్ష్యం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు’’ అని ఎయిరిండియాను ట్యాగ్‌ చేస్తూ ఆమె మండిపడ్డారు.

ఈ ట్వీట్‌ కాస్తా వైరల్‌ అవడంతో ఎయిరిండియా (Air India)పై విమర్శలు వ్యక్తమయ్యాయి. ఎయిర్‌లైన్‌ తీరును తప్పుబడుతూ పలువురు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. దీంతో తాజా ఘటనపై ఎయిరిండియా స్పందించింది. ‘‘ఇది ఆందోళనకర విషయమే. దీని గురించి మా కేటరింగ్‌ టీంతో మాట్లాడుతున్నాం. మీ సమస్యను పరిష్కరించేందుకు కొంత సమయం ఇవ్వండి. దీన్ని మా దృష్టికి తీసుకొచ్చినందుకు కృతజ్ఞతలు’’ అని ఎయిరిండియా ఆమె ట్వీట్‌కు బదులిచ్చింది.

ఇటీవల న్యూయార్క్‌ నుంచి దిల్లీ వచ్చిన ఓ ఎయిరిండియా (Air India) విమానంలో ఓ మహిళపై ప్రయాణికుడు మూత్రవిసర్జన చేసిన ఘటన తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఎయిర్‌లైన్‌ సిబ్బంది వ్యవహరించిన తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీంతో స్పందించిన ఎయిరిండియా సదరు సిబ్బందిపై వేటు వేసింది. మరోవైపు ఈ ఘటనలో నిందితుడు శంకర్‌ మిశ్రాను గతవారం దిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన జరిగిన పది రోజులకే మరో ఎయిరిండియా విమానంలో ఓ వ్యక్తి.. తోటి ప్రయాణికురాలి దుప్పటిపై మూత్రవిసర్జనకు పాల్పడిన ఘటన కూడా వివాదాస్పదమైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని