యాచకుడి అంతిమయాత్రకు వేలల్లో జనం.. సామాజిక మాధ్యమాల్లో వీడియో వైరల్‌!

కర్ణాటకలోని బళ్లారిలో జరిగిన ఓ యాచకుడి అంతిమ యాత్ర సామాజిక మాధ్యమాల్లో  వైరల్‌గా మారింది. అతడికి కడసారి వీడ్కోలు పలికేందుకు వేల సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు.

Published : 17 Nov 2021 21:19 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కర్ణాటకలోని బళ్లారిలో జరిగిన ఓ యాచకుడి అంతిమ యాత్ర సామాజిక మాధ్యమాల్లో  వైరల్‌గా మారింది. అతడికి కడసారి వీడ్కోలు పలికేందుకు వేల సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. బళ్లారిలోని హడగళికి చెందిన బసవ అలియాస్ హుచ్చా బాస్యా అనే యాచకుడితో అక్కడి వారికి ప్రత్యేక అనుబంధం ఉంది. బసవకు భిక్షం పెడితే మంచి జరుగుతుందని అక్కడి వారి నమ్మకం. అందుకే చాలా మంది పిలిచి మరీ అతడికి అన్నదానం చేసేవారు.

బసవ ఇటీవల ఓ రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఆదివారం నిర్వహించిన అంతిమ యాత్రకు వేలాది మంది ప్రజలు హాజరయ్యారు. ఓ ప్రముఖ వ్యక్తి మరణిస్తే ఎలా అయితే వస్తారో అంతమంది వచ్చారు. పట్టణంలో బ్యానర్లు కట్టి.. ఊరేగింపుగా పార్థివదేహాన్ని తీసుకెళ్లారు. బసవ మరణ వార్త విన్న చాలా మంది ప్రజలు అతడితో ఉన్న అనుబంధాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా గుర్తు చేసుకున్నారు. పలకరించిన వారందినీ అప్పాజీ (నాన్న) అని పిలిచే వాడని తెలిపారు. భిక్షం ఎత్తుకుని జీవనం సాగించే అతడు.. డబ్బులు ఎంత ఇచ్చినా కేవలం రూపాయి మాత్రమే తీసుకునే వాడని, మిగిలిన మొత్తాన్ని తిరిగి ఇచ్చేసేవాడని పట్టణవాసులు తెలిపారు. బాస్యాతో మాట్లాడడాన్ని కూడా చాలా మంది అదృష్టంగా భావించేవారని, అందుకే అతడిని ఇలా గౌరవిస్తున్నట్లు పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు