Child Marriage: మైనర్‌ బాలికతో వివాహం.. యావజ్జీవ కారాగార శిక్షే..!

బాల్యవివాహాలు చేసుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తెలిపారు. రానున్న ఐదారు నెలల్లో చట్ట వ్యతిరేక వివాహాలు చేసుకున్న వేలాది మంది భర్తలను అరెస్టు చేయనున్నట్లు చెప్పారు.

Published : 29 Jan 2023 01:18 IST

గువాహటి:  చట్ట వ్యతిరేకంగా బాల్య వివాహాలు చేసుకున్న వారికి శిక్ష తప్పదని  అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ హెచ్చరించారు.  రానున్న ఐదారు నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా మైనర్‌ బాలికలను వివాహం చేసుకున్న వేలాది మందిని అరెస్టు చేస్తామని పునరుద్ఘాటించారు. 14 ఏళ్లలోపు వయసున్న బాలికలను వివాహం చేసుకున్న వారిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తామన్నారు. గువాహటిలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సరైన వయసులోనే మహిళలు మాతృత్వపు ఆనందాన్ని పొందాలని అన్నారు. నిర్ణీత వయస్సు కంటే ముందు పిల్లలు పుట్టినా లేదా ఆలస్యంగా జన్మించినా రకరకాల సమస్యలు ఉత్పన్నమవుతాయని అన్నారు. 22 నుంచి 30 ఏళ్ల మధ్యలో పిల్లల్ని కనడం అన్ని విధాలా శ్రేయస్కరమని చెప్పారు. చిన్నవయసులో పిల్లలు కనడాన్ని వ్యతిరేకిస్తున్నప్పటికీ.. ఆలస్యంగా పిల్లలు పుట్టడం వల్ల కూడా నష్టాలు ఎదుర్కొనే అవకాశముందని, అందుకే ఉద్యోగాల్లోపడి పిల్లల్ని కనడం వాయిదా వేసుకోవద్దని కోరారు.

సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నప్పటికీ.. 14 ఏళ్ల లోపు బాలికలపై లైంగిక చర్యలకు పాల్పడితే తీవ్రంగా పరిగణిస్తామని చెప్పిన అస్సాం ప్రభుత్వం.. వారిపై పోక్సో కేసులు పెట్టాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. వివాహానికి చట్టపరమైన వయస్సు 18 ఏళ్లని చెప్పిన హిమంత బిశ్వశర్మ.. అంతకంటే తక్కువ వయస్సు ఉన్నవారిని వివాహం చేసుకున్నా కేసులు నమోదు చేసి, జీవిత ఖైదు విధిస్తామని హెచ్చరించారు.   ఈ మేరకు అక్కడి కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మాతాశిశు మరణాల రేటును అరికట్టేందుకు అక్కడి ప్రభుత్వం పటిష్ఠ చర్యలు చేపడుతోంది. ప్రజల్లో అవగాహన కల్పించడంతోపాటు.. బాల్యవివాహాలు చేసుకున్న వారిపై కేసులు నమోదు చేసేందుకు సిద్ధమైంది. 14 నుంచి 18 ఏళ్ల లోపు బాలికలను వివాహం చేసుకున్నవారిని బాల్య వివాహాల నిరోధక చట్టం కింద శిక్షించనున్నట్లు అస్సాం ప్రభుత్వం తెలిపింది. రాష్ట్రంలో దాదాపు 31 శాతం వివాహాలు తక్కువ వయసులోనే జరగుతున్నట్లు రికార్డులు చెబుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని