₹10 కోట్లు ఇవ్వాలని కేంద్రమంత్రికి బెదిరింపులు.. గడ్కరీ ఇంటి వద్ద భద్రత పెంపు!

Nitin Gadkari: కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీకి బెదిరింపు ఫోన్‌ కాల్స్‌ రావడంతో ఆయన నివాసం, ఆఫీస్‌ వద్ద భద్రతను కట్టుదిట్టం చేసినట్టు పోలీసులు వెల్లడించారు.

Updated : 21 Mar 2023 20:40 IST

నాగ్‌పూర్‌: కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి, భాజపా సీనియర్‌ నేత నితిన్‌ గడ్కరీ(Nitin Gadkari)కి మరోసారి బెదిరింపు ఫోన్‌ కాల్స్‌(threat call) రావడం కలకలం రేపింది.  రూ.10కోట్లు ఇవ్వకపోతే ఆయన ప్రాణాలకు హాని కలిగిస్తామంటూ ఓ వ్యక్తి మూడు సార్లు ఫోన్‌ చేసి బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు నాగ్‌పూర్‌(Nagpur)లోని ఆయన నివాసం, కార్యాలయం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. ఫోన్‌ కాల్‌ చేసిన దుండగుడు తనను తాను జయేశ్‌ పూజారీగా అలియాస్‌ జయేశ్‌కాంతగా పేర్కొన్నాడని, జనవరిలోనూ మంత్రి కార్యాలయానికి బెదిరింపు కాల్స్‌ చేసిన వ్యక్తి ఇతడేనని గుర్తించినట్టు పోలీసులు చెబుతున్నారు. 

ఈ ఘటనపై నాగ్‌పూర్‌ (జోన్‌-2) డీసీపీ రాహుల్‌ మదనే మీడియాతో మాట్లాడుతూ..   మంత్రి పబ్లిక్‌ రిలేషన్స్‌ కార్యాలయానికి మొత్తం మూడు ఫోన్‌ కాల్స్‌ వచ్చాయన్నారు. వీటిలో రెండు కాల్స్‌ ఉదయం రాగా.. మరో ఫోన్‌ కాల్‌ మధ్యాహ్నం 12గంటల సమయంలో వచ్చినట్టు తెలిపారు. దుండగుడు రూ.10 కోట్లు డిమాండ్‌ చేశాడని.. అడిగిన మొత్తాన్ని ఇవ్వకపోతే హాని చేస్తానంటూ బెదిరించినట్టు పేర్కొన్నారు. అయితే, గడ్కరీ సిబ్బంది ఇచ్చిన సమాచారంతో అప్రమత్తమైన పోలీసులు దర్యాప్తును ప్రారంభించారని డీసీపీ తెలిపారు. ఈ నేపథ్యంలోనే నాగ్‌పూర్‌లోని నితిన్‌ గడ్కరీ నివాసం, కార్యాలయం వద్ద భద్రతను పెంచినట్టు తెలిపారు. 

జనవరి 14న కూడా పూజారి అనే పేరుతో ఓ దుండగుడు గడ్కరీ పబ్లిక్‌ రిలేషన్స్‌ కార్యాలయానికే మూడుసార్లు ఫోన్‌ చేశాడు. తను తాను అండర్‌ వరల్డ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహీం ముఠా సభ్యుడిగా పేర్కొంటూ రూ.100 కోట్లు డిమాండ్‌ చేయడంతో పాటు గడ్కరీ ప్రాణాలకు హాని కలిగిస్తానని, ఆయన కార్యాలయాన్ని పేల్చేస్తాంటూ దుండగుడు బెదిరించడం అప్పట్లో కలకలం సృష్టించింది. అయితే,  ఓ హత్య కేసులో మరణశిక్ష పడి కర్ణాటక బెళగావిలోని హిందాల్గ జైలులో శిక్ష అనుభవిస్తున్న పూజారి.. ఈ ఫోన్‌ కాల్స్‌లో తన ప్రేమేయం లేదంటూ ఖండించాడు. అయినా, తాజాగా మరోసారి పూజారి పేరుతో గడ్కరీకి మూడు ఫోన్‌ కాల్స్‌ రావడం ఒక్కసారిగా కలకలం రేపింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని