కరోనా టీకా బదులు యాంటీ రేబిస్‌ ఇచ్చేశారు! 

యూపీలో షాకింగ్‌ ఘటన చోటుచేసుకుంది. కొవిడ్‌ టీకా పంపిణీలో ప్రభుత్వ వైద్య సిబ్బంది తీవ్ర నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చింది.....

Updated : 09 Apr 2021 20:36 IST

విచారణకు ఆదేశం

లఖ్‌నవూ: ఉత్తర్‌ప్రదేశ్‌లోని షమ్లీ జిల్లాలో షాకింగ్‌ ఘటన చోటుచేసుకుంది. కొవిడ్‌ టీకా పంపిణీలో ప్రభుత్వ వైద్య సిబ్బంది తీవ్ర నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చింది. కరోనా వ్యాక్సిన్‌ కోసం వచ్చిన మహిళలకు యాంటీ రేబిస్‌ టీకా ఇవ్వడం కలకలం రేపింది. వివరాల్లోలోకి వెళ్తే.. దేశ వ్యాప్తంగా 45 ఏళ్లు పైబడిన వారందరికీ కొవిడ్‌ టీ‌కా వేస్తున్న నేపథ్యంలో గురువారం సరోజ్‌ (70), అనార్కలి (72), సత్యవతి (60) కలిసి కండ్లాలోని ప్రభుత్వ కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌కు వెళ్లారు. టీకా వేయాలంటే బయటే సిరంజ్‌ కొనుక్కొని రావాలని వైద్య సిబ్బంది చెప్పడంతో అలాగే చేశారు. ఆ తర్వాత టీకా వేసి వారికి రేబిస్ టీకా స్లిప్పులు ఇచ్చి ఇంటికి పంపించేశారు.

కొద్దిసేపటికే సరోజ్‌ అనే మహిళకు మైకం కమ్మడం, మనసులో ఆందోళనకరంగా ఉండటంతో ఆమెను కుటుంబ సభ్యులు ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించడంతో అసలు విషయం బయట పడింది. ఆమెను పరీక్షించిన వైద్యుడు సీహెచ్‌సీ వైద్య సిబ్బంది ఇచ్చిన స్లిప్‌ను చూసి ఆశ్చర్యపోయాడు. ఆమెకు రేబిస్ టీకా ఇచ్చినట్టు కుటుంబ సభ్యులకు చెప్పడంతో వారు ఆందోళనకు దిగారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆస్పత్రి ఉన్నతాధికారులను డిమాండ్‌ చేశారు.

ఈ ఘటనపై జిల్లా మెజిస్ట్రేట్ జస్‌జీత్‌ కౌర్‌‌, వైద్యశాఖ అధికారులు స్పందించారు. ముగ్గురు ఉన్నతాధికారులతో విచారణకు ఆదేశించినట్టు చెప్పారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని