అటల్ టన్నెల్‌ వద్ద చిక్కుకున్న పర్యాటకులు

హిమాచల్‌ ప్రదేశ్‌లో మంచు విపరీతంగా కురుస్తోంది. దీంతో గత అక్టోబర్‌లో రోహ్‌తంగ్‌ వద్ద ప్రారంభించిన అటల్‌ సొరంగ మార్గం సమీపంలో 300 మంది పర్యాటకులు చిక్కుకున్నారు. శనివారం ఉదయమే వీరు సొరంగ మార్గం దాటి వెళ్లి తిరిగి మనాలీ వస్తున్న క్రమంలో లాహోల్‌ వద్ద చిక్కుకు

Updated : 03 Jan 2021 14:39 IST

రక్షించిన హిమాచల్‌ పోలీసులు

సిమ్లా: హిమాచల్‌ప్రదేశ్‌లో మంచు విపరీతంగా కురుస్తోంది. దీంతో గత అక్టోబర్‌లో రోహ్‌తంగ్‌ వద్ద ప్రారంభించిన అటల్‌ సొరంగ మార్గం సమీపంలో 300 మంది పర్యాటకులు చిక్కుకున్నారు. శనివారం ఉదయమే వీరు సొరంగ మార్గం దాటి వెళ్లి తిరిగి మనాలీ వస్తున్న క్రమంలో లాహోల్‌ వద్ద చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు సొరంగం ద్వారా ప్రత్యేక వాహనాలను పంపించి వారిని రక్షించారు. ఈ వివరాలను కులు జిల్లా ఎస్పీ గౌరవ్‌ సింగ్‌ వెల్లడించారు. మొత్తం 70 వాహనాల్లో అక్కడికి చేరుకున్న క్విక్‌ రియాక్షన్‌ బృందం సహాయ చర్యలు చేపట్టినట్లు చెప్పారు. శనివారం సాయంత్రం ప్రారంభమైన ఈ ఆపరేషన్ అర్ధరాత్రి వరకు సాగిందన్నారు.

ఇంకెవరైనా పర్యాటకులు మంచులో చిక్కుకున్నారేమోనన్న అనుమానంతో కులు డీఎస్పీ, ఎస్‌హెచ్‌వో ఆధ్వర్యంలో ప్రత్యేకంగా పెట్రోలింగ్‌ చేపడుతున్నామని ఎస్పీ చెప్పారు. భారత వాతావరణ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. రానున్న రెండుమూడు రోజుల్లో మంచు మరింత ఎక్కువగా కురిసే అవకాశముందని, అందువల్ల పర్యాటకులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జనవరి 8న దీని ప్రభావం తీవ్రంగా ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించినట్లు ఎస్పీ తెలిపారు. ప్రపంచంలోనే అత్యంతం పొడవైన సొరంగ మార్గం అటల్ టన్నెల్‌ (9.2 కి.మీ)ను గత అక్టోబర్‌లో ప్రధాని మోదీ ప్రారంభించారు. అప్పటి నుంచి అది ఓ పర్యాటక ప్రాంతంగా మారింది. దేశం నలుమూలల నుంచి పర్యాటకులు అక్కడికి వస్తున్నారు. ఈ నేపథ్యంలో వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్ఠ చర్యలు చేపడుతున్నామని అధికారులు చెబుతున్నారు.

ఇవీచదవండి

చలి..వర్షం.. లెక్కచేయని రైతన్న!

ఉచ్చులో పడొద్దు: అమెరికాకు ఇరాన్‌ హెచ్చరిక

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని