Chardham Yatra: చార్‌ధామ్‌ యాత్రలో.. డ్రోన్లు.. అత్యాధునిక అంబులెన్సులు!

చార్‌ధామ్‌ యాత్రికులకు పకడ్బందీ వైద్య సేవలు అందించేందుకుగానూ మూడంచెల వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ ప్రకటించారు. వచ్చే నెల నుంచి ఈ యాత్ర ప్రారంభం కానుంది.

Published : 06 Mar 2023 20:07 IST

దెహ్రాదూన్‌: గతేడాది చార్‌ధామ్‌ యాత్ర(Char Dham Yatra)లో భాగంగా మార్గమధ్యలో పెద్దసంఖ్యలో యాత్రికులు ప్రాణాలు కోల్పోవడం కలవరపెట్టిన విషయం తెలిసిందే. అయితే, ఈసారి యాత్రికుల ఆరోగ్య సేవలకు పూర్తి భరోసానిస్తూ.. మూడంచెల పకడ్బందీ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ(Mansukh Mandaviya) వెల్లడించారు. ఈ విషయమై ఉత్తరాఖండ్‌(Uttarakhand) ఆరోగ్య మంత్రి ధన్‌సింగ్‌ రావత్‌ సోమవారం మాండవీయతో సమావేశమయ్యారు. కష్టతరమైన యాత్రామార్గంలో యాత్రికులకు ఎదురవుతోన్న ఆరోగ్య సవాళ్లు, అత్యవసర పరిస్థితులను ఈ సందర్భంగా కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

ఈ క్రమంలోనే చార్‌ధామ్‌ యాత్రికులకు వైద్య, అత్యవసర సేవల కోసం కేంద్ర ప్రభుత్వం పటిష్ఠ ఏర్పాట్లు చేయనున్నట్లు సమావేశం అనంతరం మాండవీయ తెలిపారు. యాత్రామార్గంలో మూడంచెల వైద్యసేవలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. గుండెపోటు, ఇతరత్రా అనారోగ్యాలకు గురైన వారిని ఆసుపత్రికి తరలించే మార్గంలోనే చికిత్స మొదలయ్యేలా అధునాతన అంబులెన్స్‌లను అందుబాటులో ఉంచే ప్రణాళికలు రూపొందించామన్నారు. దేశవ్యాప్తంగా వైద్యకళాశాలల నుంచి పోస్ట్‌గ్రాడ్యుయేట్ విద్యార్థులను నియమించే ప్రతిపాదనలు ఉన్నాయని చెప్పారు. క్షేత్రస్థాయిలో మొదట చికిత్సను వారే ప్రారంభిస్తారని, ఈ అనుభవం వారి వృత్తి నైపుణ్యాల పెంపునకూ దోహదపడుతుందని వివరించారు.

ఎత్తయిన ప్రదేశాల్లో అత్యవసర మందులను వేగంగా చేరవేసేందుకు వీలుగా డ్రోన్లను ఉపయోగించనున్నట్లు చెప్పారు. కొవిడ్‌ టీకాల రవాణాకు డ్రోన్లను విజయవంతంగా ఉపయోగించినట్లు గుర్తుచేశారు. ఎయిమ్స్(రిషికేశ్), దూన్, శ్రీనగర్‌ వైద్య కళాశాలల సమన్వయంతో వైద్య ఏర్పాట్లు చేస్తామన్నారు. ఆరోగ్య సేవల విషయమై యాత్రికులకు పూర్తిస్థాయి సమాచారాన్ని అందుబాటులో ఉంచుతామని కేంద్ర మంత్రి మాండవీయ వెల్లడించారు. ఇదిలా ఉండగా.. ఈ ఏడాది చార్‌ధామ్‌ యాత్ర ఏప్రిల్‌లో ప్రారంభం కానుంది. ఇప్పటికే దాదాపు రెండు లక్షల మంది యాత్రికులు రిజిస్ట్రేషన్లు పూర్తి చేసుకున్నట్లు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని