కొవిషీల్డ్ డోసులకు 3నెలల విరామం మంచిది

ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ సహకారంతో ఆస్ట్రాజెనెకా తయారు చేసిన కొవిడ్ వ్యాక్సిన్‌ రెండు డోసులకు మధ్య మూడు నెలలు విరామంతో మెరుగైన ఫలితాలు నమోదు చేస్తున్నట్లు పరిశోధకులు వెల్లడించారు.

Published : 20 Feb 2021 16:05 IST

వెల్లడిస్తున్న ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ పరిశోధకులు

దిల్లీ: ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ సహకారంతో ఆస్ట్రాజెనెకా తయారు చేసిన కొవిడ్ వ్యాక్సిన్‌ రెండు డోసులకు మధ్య మూడు నెలల విరామంతో మెరుగైన ఫలితాలు నమోదు చేస్తున్నట్లు పరిశోధకులు వెల్లడించారు. యూకేలోని ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ పరిశోధకులు ఈ విషయాన్ని తెలిపారు. ఇటీవల లాన్సెట్‌ జర్నల్‌లో ఈ పరిశోధనా పత్రాలు ప్రచురితమయ్యాయి. ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్‌ ఒక్క డోసు మంచి ఫలితాలిస్తుండటంతో రెండో డోసుకు మూడు నెలల విరామం ఇవ్వొచ్చని పరిశోధకులు సూచించారు. ఈ విధంగా ఎక్కువ మందికి వ్యాక్సిన్‌ పంపిణీ చేసే అవకాశముంటుందని వారు తెలిపారు. ‘‘ సరిపడినన్ని టీకాలు లేకపోవడంతో పంపిణీలో ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నాం. వ్యాక్సిన్‌ సమర్థత ఆధారంగా టీకా డోసులకు మధ్య విరామాన్ని పెంచడంపై ప్రభుత్వాలు పునరాలోచించాలి.’’ అని ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్‌ ఆండ్రూ పొలార్డ్‌ తెలిపారు. ఎక్కువ మందికి రెండు డోసులు ఇవ్వడం కంటే, సమర్థత కలిగిన ఒక్క డోసునే ఎక్కువ మందికి అందించడం ఉపయుక్తంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

ఈ పరిశోధనలో భాగంగా వివిధ విరామాల్లో వ్యాక్సిన్లను అందించడం ద్వారా రోగనిరోధకశక్తి పెరగడాన్ని అధ్యయనం చేశారు. ఇందులో యూకే, బ్రెజిల్‌, దక్షిణాఫ్రికాకు చెందిన 17,178 మంది ఆరోగ్య కార్యకర్తలను ఎంచుకున్నట్లు వారు తెలిపారు. ఆరు వారాల్లోపు వ్యాక్సిన్‌ రెండో డోసును తీసుకున్నవారికంటే 12వారాల తర్వాత తీసుకున్న వారిలో మెరుగైన ఫలితాలు నమోదైనట్లు వారు వెల్లడించారు. ఒక్కడోసు తీసుకున్న వారిలో 76శాతం రోగనిరోధకశక్తి పెరిగిందని వెల్లడించారు. ఒక్క డోసు తీసుకున్న తర్వాత కరోనా యాంటీబాడీలు మూడు నెలల పాటు శరీరంలో ఉంటున్నాయని తెలిపారు. తక్కువ మోతాదులో ఎక్కువ రక్షణనిచ్చే మార్గాలను అన్వేషిస్తున్నామని పరిశోధనలో సభ్యురాలైన మెరైన్‌ వౌసే తెలిపారు.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts