Vande Bharat express: దక్షిణాదికి త్వరలో మరో 3 ‘వందే భారత్‌’ రైళ్లు.. తిరుపతి రూట్‌లో ఒకటి?

దక్షిణాదికి మరో మూడు వందే భారత్‌ రైళ్లు రాబోతున్నాయి! సికింద్రాబాద్‌-తిరుపతి, కాచిగూడ-బెంగళూరు, సికింద్రాబాద్‌-పుణె మధ్య సర్వీసులందించేందుకు రైల్వే శాఖ ప్రణాళికలు చేస్తున్నట్టు అధికారిక వర్గాలు చెబుతున్నాయి.

Published : 23 Jan 2023 20:44 IST

దిల్లీ: దక్షిణాదికి త్వరలో మరో మూడు వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌(Vande Bharat Express) రైళ్లు రాబోతున్నాయ్‌..! దక్షిణాది రాష్ట్రాల్లో ఇప్పటికే రెండు వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు నడుపుతోన్న భారతీయ రైల్వే(Indian railways) మరో మూడు సెమీ హైస్పీడ్‌ రైళ్ల(Semi hi-speed rails)ను పట్టాలెక్కించేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్టు అధికారిక వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ కొత్త రైళ్లు కాచిగూడ నుంచి బెంగళూరు; సికింద్రాబాద్‌ నుంచి తిరుపతి; సికింద్రాబాద్‌ నుంచి పుణె నగరాల మధ్య సర్వీసులందించనున్నట్టు సమాచారం. దక్షిణ భారతదేశంలో తొలి వందే భారత్‌ రైలును చెన్నై-బెంగళూరు-మైసూరు మధ్య గతేడాది నవంబర్‌లో ప్రారంభించగా.. ఇటీవల సంక్రాంతి కానుకగా తెలుగు రాష్ట్రాల మధ్య (సికింద్రాబాద్‌-వైజాగ్‌) మరో రైలు సర్వీసును ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్‌గా ప్రారంభించిన విషయం తెలిసిందే. సికింద్రాబాద్‌- విశాఖపట్నం మధ్య సర్వీసులు ప్రారంభమైనప్పట్నుంచి ఈ రైలు 100శాతం ఆక్యుపెన్సీతో నడుస్తోందని అధికారులు చెబుతున్నారు. మరోవైపు, కర్ణాటక, తెలంగాణలో ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు ఉండటం.. వచ్చే ఏడాదిలో ఏపీ అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్‌సభ ఎన్నికలు జరగనుండటంతో కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్రాలపై ప్రత్యేకంగా దృష్టిసారిస్తోంది. దక్షిణాదిపై పట్టు సాధించేందుకు వీలుగా భాజపా శ్రేణులు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.

ఇదిలా ఉండగా.. వందేభారత్ రైళ్ల మెయింటీనెన్స్‌ కోసం సికింద్రాబాద్, హైదరాబాద్, విజయవాడ డివిజన్లలో కనీసం ఒక్క కోచింగ్‌ డిపోలోనైనా మౌలిక సదుపాయాలను అప్‌గ్రేడ్‌ చేయాలని దక్షిణ మధ్య రైల్వేలోని రైల్వే డివిజన్ల అధికారులు కోరినట్టు సమాచారం. దేశవ్యాప్తంగా ఈ ఏడాది చివరికల్లా 75 వందే భారత్‌ రైళ్లు నడపాలని కేంద్ర రైల్వే శాఖ ప్రణాళికలు రచిస్తోంది. అలాగే, వచ్చే మూడేళ్లలో 400లకు పైగా వందే భారత్‌ రైళ్లను పట్టాలెక్కించడమే టార్గెట్‌గా పెట్టుకుంది. ఈ రైళ్లను ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోన్న కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు దేశంలోని పలు నగరాల మధ్య ఎనిమిది రైళ్లను నడుపుతోంది. మేకిన్ ఇండియాలో భాగంగా చెన్నైలోని పెరంబూరులో ఇంటిగ్రల్‌ కోచ్‌ ఫ్యాక్టరీలో ఈ సెమీ హై-స్పీడ్‌ రైళ్లు తయారవుతున్నాయి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని