Demonetisation: నోట్ల రద్దు నుంచి సుప్రీం తీర్పు వరకు.. ప్రస్థానం సాగిందిలా..!

పెద్ద నోట్లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం 2016లో కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఓవైపు ప్రభుత్వ నిర్ణయంపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తుండగా.. మరోవైపు న్యాయస్థానంలో పోరాటం కొనసాగింది. ఇలా చివరకు నోట్ల రద్దు నిర్ణయాన్ని సుప్రీం కోర్టు సమర్థిస్తూ తీర్పు వెలువరించింది.

Published : 02 Jan 2023 18:14 IST

దిల్లీ: నరేంద్ర మోదీ ప్రభుత్వం 2016లో పెద్ద నోట్లను (రూ. వెయ్యి, రూ.500) రద్దు చేస్తూ (Demonetisation) సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దాని ఫలితాలు ఎలా ఉన్నా.. ప్రభుత్వ నిర్ణయంపై విపక్షాలు మండిపడ్డాయి. నోట్ల రద్దుతో దేశ ఆర్థిక వ్యవస్థ క్షీణించడంతోపాటు ప్రజలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారంటూ తీవ్ర విమర్శలు గుప్పించాయి. ఈ క్రమంలోనే పెద్ద నోట్ల రద్దు (Demonetisation)ను వ్యతిరేకిస్తూ సుప్రీం కోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిని విచారించిన సుప్రీం ధర్మాసనం (Supreme Court).. నోట్లను రద్దుచేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనదేనంటూ తాజాగా తీర్పు వెలువరించింది. ఈ నేపథ్యంలో నోట్ల రద్దు ప్రకటన నుంచి ఇప్పటివరకు చోటుచేసుకున్న కొన్ని పరిణామాలను ఓసారి చూద్దాం..

నవంబర్‌ 8, 2016: ప్రధాని మోదీ జాతినుద్దేశించి ప్రసంగిస్తూ.. రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తున్నట్లు సంచలన ప్రకటన 

నవంబర్‌ 9, 2016: ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ భారత అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు

డిసెంబర్‌ 16, 2016: ఈ నిర్ణయం చెల్లుబాటుతో పాటు ఇతర ప్రశ్నలపై విచారణ జరిపేందుకు ఐదుగురి సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేస్తున్నట్లు అప్పటి చీఫ్‌ జస్టిస్‌ టీఎస్‌ ఠాకూర్‌ నేతృత్వంలోని ధర్మాసనం వెల్లడి

జులై 23, 2017: గత మూడేళ్లలో ఆదాయపన్ను శాఖ జరిపిన విస్తృత సోదాల్లో సుమారు రూ.71వేల కోట్ల అక్రమ నగదు గుర్తించినట్లు సుప్రీం కోర్టుకు తెలియజేసిన కేంద్ర ప్రభుత్వం

ఆగస్టు 11, 2017: నోట్ల రద్దు సమయంలో అసాధారణ డిపాజిట్లు జరిగినట్లు ఆర్బీఐ ప్రకటించింది. మొత్తంగా రూ.2.8 నుంచి రూ.4.3లక్షల కోట్లు బ్యాంకింగ్‌ వ్యవస్థలోకి అదనంగా వచ్చి చేరినట్లు వెల్లడి

ఆగస్టు 25, 2017: రూ.50, రూ.200 విలువైన కొత్త కరెన్సీ నోట్లను విడుదల చేసిన భారతీయ రిజర్వు బ్యాంకు

సెప్టెంబర్‌ 28, 2022: పెద్ద నోట్ల రద్దుపై దాఖలైన పిటిషన్లను విచారించేందుకు జస్టిస్‌ ఎస్‌ఏ నజీర్‌ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనాన్ని సుప్రీం కోర్టు ఏర్పాటు చేసింది. నోట్ల రద్దును సవాలు చేసే ఫిర్యాదులను క్రమంగా పరిశీలిస్తుందని తెలిపింది.

డిసెంబర్‌ 7, 2022: దీనిపై తీర్పు రిజర్వు చేసిన సుప్రీం ధర్మాసనం.. నోట్ల రద్దు ప్రక్రియకు సంబంధించిన అన్ని రికార్డులను తమకు అందజేయాలంటూ కేంద్రంతో పాటు ఆర్బీఐని ఆదేశించింది.

జనవరి 2, 2023: పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తూ సుప్రీం ధర్మాసనం తీర్పు వెలువరించింది. కేంద్రం తీసుకున్న నిర్ణయం లోపభూయిష్టంగా లేదని.. ఆర్బీఐ, కేంద్ర ప్రభుత్వం మధ్య సంప్రదింపుల తర్వాతే నిర్ణయం తీసుకున్నారని స్పష్టం చేసింది. అయితే, ధర్మాసనంలో నలుగురు సభ్యులు ఏకీభవించినప్పటికీ.. జస్టిస్‌ నాగరత్న మాత్రం ఇది చట్టవిరుద్ధమంటూ తీర్పు చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని