Titanic: నౌక మునుగుతోంది.. అయినా ప్రయాణికులను రక్షించి కడలిలో కలిశారు!

టైటానిక్‌.. ఈ పేరు వింటే మనకు మొదటగా గుర్తొచ్చేది విషాద ఘటనే! 1912లో సౌతంప్టన్‌ నుంచి న్యూయార్క్‌ వెళ్తుండగా.. నార్త్‌ అట్లాంటిక్‌ మహాసముద్రంలో ఐస్‌బర్గ్‌ను ఢీకొని మునిగిపోవడం, దాదాపు 1500 మంది మృతి చెందడం అందరికి తెలిసిందే. కానీ.. ఇది నాణెనికి...

Published : 26 Nov 2021 17:08 IST

‘టైటానిక్‌’ ఇంజినీరింగ్‌ సిబ్బంది త్యాగనిరతి

ఇంటర్నెట్‌ డెస్క్‌ ప్రత్యేకం

టైటానిక్‌.. ఈ పేరు వింటే మనకు మొదటగా గుర్తొచ్చేది విషాద ఘటనే! 1912లో సౌతంప్టన్‌ నుంచి న్యూయార్క్‌ వెళ్తుండగా.. నార్త్‌ అట్లాంటిక్‌ మహాసముద్రంలో ఐస్‌బర్గ్‌ను ఢీకొని మునిగిపోవడం, దాదాపు 1500 మంది మృతి చెందడం అందరికి తెలిసిందే. కానీ.. ఇది నాణెనికి ఒకవైపు మాత్రమే. మరోవైపు ఈ మహా జలసౌధం నిర్మాణం, ప్రయాణం వెనుక తెలియని విశేషాలెన్నో! ప్రమాద సమయంలో ప్రయాణికులను రక్షించడమే పరమావధిగా విధులు నిర్వహించి.. తుదకు నౌకతోపాటే జలసమాధి అయిన ప్రాణాలెన్నో! ఇందులో ముందువరుసలో నిలిచేది.. ఓడలోని ఇంజినీరింగ్‌ సిబ్బందే. వీరిలో ఏ ఒక్కరూ బతకలేదంటే.. చివరి క్షణంలోనూ వారి నిబద్ధత అర్థం చేసుకోవచ్చు. వీరి త్యాగాలకు ప్రతీకగా నిర్మించిన ఓ స్మృతివనం.. నేటికీ ఆనాటి జ్ఞాపకాలను కళ్లముందు ఉంచుతోంది.

నౌక నిర్మాణ విశేషాలు..

ఆ సమయంలో ఇంతటి భారీ నౌక నిర్మాణం ఎవరూ ఊహించనిది.ఇతర నౌకా నిర్మాణ కంపెనీల కంటే ముందుండాలనే ‘వైట్ స్టార్ లైన్’ సంస్థ ఛైర్మన్ జే బ్రూస్ ఇస్మాయ్ ఆలోచనలే.. అప్పట్లో ప్రపంచంలోనే అతిపెద్దదైన ఈ ఓడ నిర్మాణానికి దారితీశాయి. ఉత్తర ఐర్లాండ్‌లోని బెల్‌ఫాస్ట్‌లో 1909లో ప్రారంభమైన నిర్మాణం 1912 ఏప్రిల్‌ నాటికి పూర్తయింది.

* టైటానిక్ పొడవు 269.06 మీటర్లు, గరిష్ఠ వెడల్పు 28.19 మీటర్లు, ఎత్తు 32 మీటర్లు, బరువు దాదాపు 46,328 టన్నులు. పదకొండు డెక్‌లు ఉన్నాయి. అందులో ఎనిమిది ప్రయాణికుల కోసం కట్టినవి. నీటి ఆవిరే ఇంధనం. భారీ పిస్టన్‌ ఇంజిన్లు దీని సొంతం.

* ఓడ నిర్మాణంలో దాదాపు రెండు వేల ఉక్కు పలకలు వాడారు. ఒక్కోటి 1.8 మీటర్ల వెడల్పు, 9.1 మీటర్ల పొడవు, బరువు 2.5- 3 టన్నులు. స్టీల్ వెల్డింగ్ ఇంకా ప్రాచుర్యంలోకి రాని కారణంగా.. దాదాపు 30 లక్షలకు పైగా నట్లు, బోల్టులు వినియోగించారు.

* 15 వేల మంది కార్మికులు నిర్మాణంలో పాల్పంచుకున్నారు. చేతులు తెగిపడటం, ఉక్కు పలకల కింద కాళ్లు నలగడం వంటి ప్రమాదాలు అనేకం జరిగాయి.

* నిర్మాణ దశలోనే ఆరుగురు కార్మికులు మరణించారు. మరో ఇద్దరు షిప్‌యార్డ్ వర్క్‌షాప్‌, షెడ్‌లలో ప్రాణాలు కోల్పోయారు. ఓడ జలప్రవేశానికి ముందు.. పడిపోతున్న చెక్కపలక తగిలి ఓ కార్మికుడు మృతి చెందాడు.

* నౌకలో ఆవిరితో నడిచే నాలుగు 400 కేడబ్ల్యూ ఎలక్ట్రిక్ జనరేటర్లు, అత్యవసర అవసరాలకు మరో రెండు 30 కేడబ్ల్యూ సహాయక జనరేటర్లతో ఎలక్ట్రికల్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. ఆ సమయంలో ఒక సాధారణ నగరంలోని పవర్ స్టేషన్ కంటే ఎక్కువ విద్యుత్‌శక్తిని ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని దీని సొంతం.

* సముద్రంలో లంగరు వేసేందుకు ఉపయోగించిన సెంటర్ యాంకర్ బరువు 15 టన్నులు. పొడవు 18 అడుగుల ఆరంగుళాలు. అప్పట్లో చేతితో తయారు చేసిన అతిపెద్ద యాంకర్‌ ఇదే!

మరువలేనిది.. ఇంజినీర్ల త్యాగం

టైటానిక్‌కు చీఫ్‌ ఇంజినీర్‌గా  జోసెఫ్‌ బెల్‌ వ్యవహరించారు. ఆయన బృందంలో 24 మంది సివిల్‌ ఇంజినీర్లు, ఆరుగురు ఎలక్ట్రికల్‌ ఇంజినీర్లు, ఇద్దరు బాయిలర్‌ మేకర్లు, ఒక ప్లంబర్‌, ఒక క్లర్క్‌ ఉన్నారు. ప్రమాద సమయంలో అందులోనే ఉన్న వీరంతా.. ప్రయాణికులను రక్షించేందుకు సర్వశక్తులు ఒడ్డారు. అత్యవసర పడవలను నీళ్లలోకి దించుతూ.. పనిలోనే నిమగ్నమై, చివరకు నీటమునిగి ప్రాణాలు కోల్పోయారు. వారి త్యాగాలను స్మరించుకుంటూ సౌతంప్టన్‌లోని ఈస్(ఆండ్య్రూస్‌) పార్క్‌లో ‘టైటానిక్‌ ఇంజినీర్స్‌ మెమోరియల్‌’ పేరిట ఓ స్మారక వనాన్ని నిర్మించారు. 1914లో దీని ప్రారంభ కార్యక్రమానికి లక్షలాది మంది హాజరై.. శ్రద్ధాంజలి ఘటించారు! ‘చివరి క్షణాల్లోనూ తమ కర్తవ్యానికి అంకితమైన ఈ ఇంజినీర్లు.. మానవ జాతి అత్యుత్తమ సంప్రదాయాలను సమర్థంగా కొనసాగించారు’ అంటూ ముఖ్య అతిథిగా హాజరైన ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెరైన్‌ ఇంజినీర్స్ అప్పటి ప్రెసిడెంట్‌ సర్ ఆర్చిబాల్డ్ డెన్నీ భావోద్వేగానికి గురయ్యారు.

2010లో పునరుద్ధరణ..

సౌతంప్టన్ సిటీ కౌన్సిల్, టీవీ నిర్మాణ సంస్థ ట్వంటీ ట్వంటీ టెలివిజన్ సంయుక్త ఆధ్వర్యంలో 2010లో ఈ స్మారక వనాన్ని పునరుద్ధరించారు. ఇదే ప్రమాదంలో కన్నుమూసిన ప్రఖ్యాత వాయొలిన్‌ కళాకారుడు వాలెస్ హార్ట్‌లీ, ఇతర సంగీతకారుల స్మృత్యార్థం ప్రధాన స్మారకానికి ఎదురుగా ‘టైటానిక్ మ్యూజిషియన్స్ మెమోరియల్’ నిర్మించారు.

విషాదం నేర్పిన పాఠాలు..

‘ప్రమాదాన్ని మినహాయిస్తే.. టైటానిక్ ఇంజినీరింగ్ డిజైన్‌, నిర్మాణంలో ఎటువంటి లోపాలు లేవు. కానీ.. ఏ ఇంజినీర్‌ కూడ ప్రకృతి శక్తులతో పోటీ పడలేడు’ - టైటానిక్‌ను నిర్మించిన హార్లాండ్, వోల్ఫ్ ప్రతినిధి డేవిడ్ మెక్‌వేగ్ అన్న మాటలివి. నేటికీ ఓడలు ఈ తరహా ప్రమాదాలు ఎదుర్కొంటున్నాయని ఆయన ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు. అయితే.. టైటానిక్‌ ప్రమాదంతో ఓడ నిర్మాణ రంగం, అందులో కల్పించాల్సిన సౌకర్యాలపై మరింత అవగాహన వచ్చినట్లు చెప్పారు. మరిన్ని ఎమర్జెన్సీ బోట్లను అందుబాటులో ఉంచడం, ఆటోమేటిక్ బల్క్ హెడ్ డోర్ల అభివృద్ధి తదితర ఏర్పాట్లు ఇందుకు ఉదాహరణలని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని