Sourav Ganguly: దాదా భాజపాలో చేరనందుకేనా..? తృణమూల్ విమర్శ

గంగూలీ మరో దఫా బీసీసీఐ అధ్యక్షుడిగా నియమితులు కాకపోవడంపై తృణమూల్ కాంగ్రెస్ స్పందించింది. 

Published : 12 Oct 2022 14:33 IST

కోల్‌కతా: గత మూడేళ్లుగా భారత క్రికెట్లో చక్రం తిప్పిన టీమిండియా మాజీ కెప్టెన్‌ సౌరభ్‌ గంగూలీ మరో దఫా బీసీసీఐ అధ్యక్షుడిగా నియమితులయ్యే అవకాశం లేకుండా పోయింది. 1983 ప్రపంచకప్‌ హీరో రోజర్‌ బిన్నీ (కర్ణాటక) బోర్డు తదుపరి అధ్యక్షుడిగా ఎన్నికవనున్నారు. దీనిపై తృణమూల్ కాంగ్రెస్ స్పందించింది. భాజపాపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించింది. దాదాను పార్టీలోకి చేర్చుకోలేకపోయిన కమల దళం.. ఆయన్ను అవమానించేందుకు ప్రయత్నిస్తోందని మండిపడింది. 

‘కేంద్రమంత్రి అమిత్‌ షా కొద్ది నెలల క్రితం గంగూలీ ఇంటికి వెళ్లారు. భాజపాలో చేరమని ఆయన్నుపదేపదే అడిగినట్లు సమాచారం. అందుకు ఆయన అంగీకారం చెప్పలేదేమో..! అందుకే రాజకీయ ప్రతీకారానికి బలైపోయారు. అమిత్‌ షా తనయుడు జై షా రెండోసారి బీసీసీఐ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టొచ్చు. కానీ, గంగూలీ మాత్రం అధ్యక్ష పదవిని చేపట్టడానికి వీలు లేదు’ అని తృణమూల్ విరుచుకుపడింది. 

అయితే ఈ విమర్శలను భాజపా ఖండించింది. ఈ ప్రిన్స్‌ ఆఫ్ కోల్‌కతా(గంగూలీ)ను పార్టీలోకి చేర్చుకోవాలని ఎన్నడూ ప్రయత్నించలేదని వెల్లడించింది. ‘బీసీసీఐలోని మార్పులపై కొందరు మొసలి కన్నీరు కారుస్తున్నారు. గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడు కావడం వెనక వారి పాత్ర ఏం లేదు కదా..? ఈ విషయాన్ని రాజకీయం చేయడం మానండి’ అంటూ ఆ విమర్శలను తోసిపుచ్చింది. 

గత ఏడాది పశ్చిమ్ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల సమయంలో గంగూలీ భాజపాలో చేరతారని భారీగా ప్రచారం జరిగింది. అయితే మాజీ క్రికెటర్‌ మాత్రం రాజకీయాలకు దూరంగా ఉంటూ, క్రికెట్ వైపే తన సేవలు అందించాలని భావించారు. అలాగే అమిత్‌ షా తన ఇంట్లో భోజనం చేసిన సమయంలో వచ్చిన ఊహాగానాలపై సమాధానం కూడా ఇచ్చారు. తనకు జైషాతో ఉన్న పరిచయమే కేంద్రమంత్రి రాకకు కారణమంటూ ఆ వార్తలకు చెక్ పెట్టారు. 

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని