Parliament: రాజ్యసభలో పత్రాలు చించేసిన ఎంపీపై సస్పెన్షన్‌ వేటు

రాజ్యసభలో కేంద్రమంత్రి నుంచి పత్రాలు లాక్కొని, చించేసి అమర్యాదగా ప్రవర్తించిన తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ శంతను సేన్‌పై వేటు పడింది. వర్షాకాల సమావేశాలు పూర్తయ్యేంతవరకు

Updated : 23 Jul 2021 15:54 IST

దిల్లీ: రాజ్యసభలో కేంద్రమంత్రి నుంచి పత్రాలు లాక్కొని, చించేసి అమర్యాదగా ప్రవర్తించిన తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ శంతను సేన్‌పై వేటు పడింది. వర్షాకాల సమావేశాలు పూర్తయ్యేంతవరకు ఆయన సభకు హాజరుకాకుండా సస్పెండ్‌ చేశారు. ఈ మేరకు శుక్రవారం రాజ్యసభలో తీర్మానం ప్రవేశపెట్టి ఆమోదించారు.

పెగాసస్‌తో హ్యాకింగ్‌ వ్యవహారంపై కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ నిన్న రాజ్యసభలో మాట్లాడారు. ‘‘గతంలో వాట్సప్‌కు సంబంధించి ఇలాంటి ఆరోపణలే వచ్చాయి. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదు, భారత ప్రజాస్వామ్యాన్ని, దేశంలోని వ్యవస్థల్ని అప్రతిష్ఠపాలు చేసేందుకే కొందరు ఇలా చేస్తున్నారు’’ అని చెప్పారు. మంత్రి మాట్లాడుతుండగానే తృణమూల్‌ ఎంపీ శంతను సేన్‌ ఆయన చేతిలోని ప్రతులను లాక్కొని, చించివేసి గాల్లోకి విసిరారు.

సేన్‌ ప్రవర్తనపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన కేంద్ర ప్రభుత్వం.. ఆయనను సస్పెండ్‌ చేయాలంటూ సభలో తీర్మానం ప్రవేశపెట్టింది. ఈ తీర్మానాన్ని మూజువాణి ఓటు ద్వారా ఆమోదించారు. వర్షాకాల సమావేశాలు పూర్తయ్యే వరకు ఆయనను సస్పెండ్‌ చేస్తున్నట్లు ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు తెలిపారు. ఆ తర్వాత సేన్‌ సభ నుంచి వెళ్లిపోవాలని ఛైర్మన్‌ సూచించారు. అయితే ఎంపీ వెళ్లకపోవడంతో సభలో గందరగోళం నెలకొని, సభ పలుమార్లు వాయిదా పడింది. ఆ తర్వాత ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు.. తృణమూల్‌ ఎంపీని తన కార్యాలయానికి పిలిపించుకుని మాట్లాడారు.

లోక్‌సభ సోమవారానికి వాయిదా..

అటు లోక్‌సభలో శుక్రవారం కూడా ఎలాంటి చర్చా జరగలేదు. ఈ ఉదయం సభ ప్రారంభం కాగానే విపక్ష ఎంపీలు పెగాసస్‌ వ్యవహారంపై చర్చకు పట్టుబట్టారు. ప్రతిపక్షాల నినాదాల నడుమే స్పీకర్‌ ప్రశ్నోత్తరాల గంటను కొనసాగించారు. అయితే ఆందోళన ఉద్ధృతమవడంతో సభను గంటపాటు వాయిదా వేశారు. తిరిగి 12 గంటలకు లోక్‌సభ ప్రారంభమైనా పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. దీంతో సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్‌ ప్రకటించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని