NEET: ‘నీట్‌’ మినహాయింపునకు రేపే బిల్లు తీసుకొస్తాం

తమిళనాడుకు ‘నీట్‌’ నుంచి మినహాయింపు కోరుతూ సోమవారం రాష్ట్ర అసెంబ్లీలో బిల్లు తీసుకొస్తామని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ ప్రకటించారు. ఆదివారం ఈ ప్రవేశ పరీక్షకు కొద్ది గంటల ముందు సేలంలో ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడటం...

Published : 12 Sep 2021 18:13 IST

తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌

చెన్నై: తమిళనాడుకు ‘నీట్‌’ నుంచి మినహాయింపు కోరుతూ సోమవారం రాష్ట్ర అసెంబ్లీలో బిల్లు తీసుకొస్తామని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ ప్రకటించారు. ఆదివారం ఈ ప్రవేశ పరీక్షకు కొద్ది గంటల ముందు సేలంలో ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడటం రాష్ట్రంలో చర్చనీయాంశమైంది. అతను మూడో సారి ప్రవేశ పరీక్షకు సిద్ధమయ్యాడని.. ఈ సారి కూడా ఎక్కడ అర్హత సాధించలేనేమోనన్న ఆందోళనతో బలన్మరణానికి పాల్పడినట్లు స్థానిక పోలీసులు వెల్లడించారు. ఈ వ్యవహారంపై ప్రతిపక్షాలు.. అధికార పార్టీ డీఎంకేపై విమర్శలకు దిగాయి. ఏఐఏడీఎంకే నేత, మాజీ ముఖ్యమంత్రి పళనిస్వామి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ‘నీట్‌’ను రద్దు చేస్తామని చెప్పిన డీఎంకే.. తన హామీని నెరవేర్చడం లేదని విమర్శించారు. రాష్ట్రంలో ప్రవేశ పరీక్ష జరుగుతుందా లేదా అని విద్యార్థుల్లో గందరగోళం సృష్టించారని ఆరోపించారు. పరీక్ష మినహాయింపు విషయంలో డీఎంకే వాగ్దానం ఏమైంది? అని ఆయన ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై స్పందిస్తూ స్టాలిన్‌ ఓ ట్వీట్‌ చేశారు. ‘నీట్‌ బలిపీఠంపై మరొక మరణం. కేవలం పరీక్షలో అర్హత సాధిస్తేనే విద్య దక్కుతుందనే అన్యాయాన్ని అంతం చేయనివ్వండి. రాష్ట్రానికి ‘నీట్’ నుంచి శాశ్వత మినహాయింపు కోరుతూ రాష్ట్ర అసెంబ్లీలో సోమవారం బిల్లు తీసుకొస్తాం’ అని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా వైద్య కళాశాలల్లో అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్(నీట్) నిర్వహిస్తారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని