Corona: అనాథలైన చిన్నారులకు రూ. 5లక్షలు

కరోనా మహమ్మారి కారణంగా అమ్మానాన్నలను కోల్పోయి అనాథలుగా మారిన చిన్నారులను ఆదుకునేందుకు తమిళనాడు ప్రభుత్వం ముందుకొచ్చింది. అలాంటి పిల్లలకు రూ.5లక్షల ఆర్థిక సాయం ప్రకటించింది.

Published : 29 May 2021 15:53 IST

చెన్నై: కరోనా మహమ్మారి కారణంగా అమ్మానాన్నలను కోల్పోయి అనాథలుగా మారిన చిన్నారులను ఆదుకునేందుకు తమిళనాడు ప్రభుత్వం ముందుకొచ్చింది. అలాంటి పిల్లలకు రూ.5లక్షల ఆర్థిక సాయం ప్రకటించింది. ఈ డబ్బును చిన్నారుల పేరిట ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేస్తామని, వారికి 18 ఏళ్లు వచ్చిన తర్వాత వడ్డీతో సహా తీసుకోవచ్చని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్‌ శనివారం ప్రకటించారు. తల్లిదండ్రుల్లో ఒకరిని కోల్పోయిన చిన్నారులకు రూ.3లక్షల సాయం అందజేస్తామని ఆయన తెలిపారు.

అంతేగాక, అనాథలైన చిన్నారుల సంరక్షణ, చదువు బాధ్యతలు కూడా ప్రభుత్వమే చూసుకుంటుందని సీఎం తెలిపారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యేంతవరకు వారి చదువు ఖర్చులు రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు. ప్రభుత్వ వసతి గృహాల్లో వారికి ఆశ్రయం కల్పిస్తామన్నారు. ఒకవేళ ఈ వసతి గృహాల్లో కాకుండా చిన్నారులు తమ బంధువుల ఇళ్లల్లో ఉండాలనుకుంటే వారికి 18ఏళ్లు వచ్చేవరకు ప్రతి నెలా రూ.3000 అందజేస్తామని వెల్లడించారు. అనాథలుగా మారిన పిల్లల సంరక్షణ బాధ్యతలను పర్యవేక్షించేందుకు ప్రతి జిల్లాలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. 

రెండోదశలో కరోనా రక్కసి ఎన్నో కుటుంబాలను ఛిద్రం చేసింది. ఎంతోమంది చిన్నారులను, వృద్ధులను ఒంటరి చేసింది. ఈ క్రమంలో అమ్మానాన్నల్ని కోల్పోయి అనాథలుగా మారిన పిల్లలను ఆదుకునేందుకు ఇప్పటికే అనేక రాష్ట్రాలు సిద్ధమయ్యాయి. వారి చదువు బాధ్యతలు తీసుకోవడంతో పాటు ఆర్థిక సహకారాన్ని కూడా ప్రకటించాయి. అనాథలైన చిన్నారులను గుర్తించి తక్షణ సాయం అందించాలని సుప్రీంకోర్టు కూడా రాష్ట్రాలను ఆదేశించింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని