
Omicron: తమిళనాడు, కర్ణాటకల్లో భారీగా ఒమిక్రాన్ కేసులు
ఇంటర్నెట్ డెస్క్: రెండేళ్లు దాటినా కరోనా మహమ్మారి ఇంకా మనల్ని నీడలా వెంటాడుతూనే ఉంది. కొత్త రూపాలతో ప్రజల్ని భయాందోళనలకు గురిచేస్తూనే ఉంది. కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతున్న వేళ ఒమిక్రాన్ తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. రోజురోజుకీ కొత్త కేసులు పెరిగిపోతున్నాయి. తాజాగా తమిళనాడులో ఒక్కరోజే 76 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 120కి పెరిగింది. 117 శాంపిల్స్‌ని పుణులోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ల్యాబ్‌కు జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపగా.. 115 శాంపిల్స్ ఫలితాలు వచ్చాయని ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. వీటిలో 74 ఒమిక్రాన్ ఉన్నట్టు తేలగా.. 41 మందిలో డెల్టా వేరియంట్ ఉన్నట్టు నిర్ధారణ అయినట్టు వెల్లడించారు. ఇంకా రెండు శాంపిల్స్‌కు సంబంధించిన ఫలితాలు రావాల్సి ఉందని తెలిపారు. అయితే, ఇప్పటివరకు రాష్ట్రంలో 66 మంది కోలుకొని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి కాగా.. 52 యాక్టివ్ కేసులు ఉన్నట్టు తెలిపారు. ఒక్క చెన్నైలోనే 95 కేసులు నమోదు కాగా.. చెంగల్‌పేటలో ఐదు, మధురైలో నాలుగు, తిరువల్లూరులో మూడు, సేలం, తిరువరూరు, కోయంబత్తూరు, పడుక్కొట్టై, తంజావూరు, తిరుచిరాపల్లి, రాణిపేటలలో ఒక్కో కేసు చొప్పున నమోదైనట్టు అధికారులు బులిటెన్‌లో పేర్కొన్నారు.
కర్ణాటకలో ఒకేరోజు 23 కేసులు
కర్ణాటకలోనూ ఒమిక్రాన్ కేసులు రోజురోజుకీ పెరుగుతున్నాయి. కొత్తగా మరో 23 కొత్త కేసులు వచ్చినట్టు ఆరోగ్యశాఖ మంత్రి కె. సుధాకర్ వెల్లడించారు. వీరిలో 19 మంది అమెరికా, యూరప్, ఆఫ్రికా వంటి దేశాల నుంచి వచ్చిన వారేనన్నారు. కొత్త వాటితో కలిపి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 66కి చేరిందన్నారు. దేశంలో తొలిసారి నమోదైన రెండు ఒమిక్రాన్ కేసులు కర్ణాటకలోనే నమోదైన విషయం తెలిసిందే.
బీచ్‌ల వద్ద న్యూ ఇయర్ వేడుకలపై నిషేధం
కొత్త సంవత్సర వేడుకల వేళ కర్ణాటకలోని మంగళూరు నగర అధికారులు కఠిన ఆంక్షలు విధించారు. శుక్రవారం రాత్రి 7గంటలు దాటాక బీచ్‌లకు ప్రజల రాకపై నిషేధం అమలుచేశారు. బహిరంగ ప్రదేశాల్లోనూ వేడుకలకు అనుమతిలేదని చెప్పారు. ఒమిక్రాన్ కలకలంతో డిసెంబర్ 28 నుంచే రాత్రిపూట కర్ఫ్యూ (రాత్రి 10 నుంచి ఉదయం 5గంటల వరకు) అమలు చేస్తున్నారు.
కేరళలో వంద మార్కును దాటేసింది..
కేరళలో ఒమిక్రాన్ కేసులు భారీగా నమోదయ్యాయి. శుక్రవారం ఒక్కరోజే ఏకంగా 44 కొత్త కేసులు వెలుగుచూశాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం ఒమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య 107కి పెరిగిందని ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. వీరిలో 10 మంది బాధితులు హైరిస్క్ దేశాల నుంచి రాగా.. 27 మంది లో-రిస్క్ దేశాల నుంచి వచ్చారని తెలిపారు. మిగతా ఏడుగురికి మాత్రం కాంటాక్టు ద్వారా సోకినట్టు పేర్కొన్నారు.
► Read latest National - International News and Telugu News
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.