Rahul vs Rajnath: రాహుల్‌ VS రాజ్‌నాథ్‌.. అగ్నిపథ్‌పై మాటల తూటాలు

పార్లమెంట్‌ సమావేశాల్లో భాగంగా అగ్నిపథ్‌ పథకంపై లోక్‌సభలో ప్రతిపక్షనేత రాహుల్‌ గాంధీ, రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ మధ్య మాటల తూటాలు పేలాయి.

Updated : 01 Jul 2024 20:26 IST

దిల్లీ: లోక్‌సభ సమావేశాలు (Lok sabha Session) వాడీవేడిగా సాగుతున్నాయి. ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi), రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ (Rajnath Singh) మధ్య మాటల తూటాలు పేలాయి. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన అగ్నిపథ్‌ను (AgniPath) ‘యూజ్‌ అండ్‌ త్రో లేబర్‌’ పథకంగా రాహుల్‌ అభివర్ణించారు. దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన రాజ్‌నాథ్‌ సింగ్.. ప్రతిపక్షనేత ప్రజల్లో లేనిపోని అపోహలను సృష్టిస్తున్నారని మండిపడ్డారు. 

‘‘మందుపాతర పేలి ఒక అగ్నివీర్‌ ప్రాణాలు కోల్పోతే అతడిని అమరవీరుడిగా పరిగణించరు. నేను అమరుడన్నా, కేంద్ర ప్రభుత్వం కానీ, ప్రధాని మోదీ కానీ ఆ పేరుతో పిలవరు. కేవలం అగ్నివీర్‌గానే గుర్తిస్తారు. అతడి కుటుంబానికి పింఛన్‌ రాదు. ఎలాంటి నష్టపరిహారం కూడా ఇవ్వరు. కేంద్రం దృష్టిలో అగ్నివీరులంతా ఉపయోగించుకొని వదిలేసే ఓ లేబర్‌ లాంటివారు’’ అంటూ ఘాటుగా విమర్శించారు. ఈ పథకాన్ని తీసుకొస్తున్నప్పుడే దేశంలోని పలు ప్రాంతాల్లో హింసాత్మక నిరసనలు జరిగినట్లు ఈ సందర్భంగా రాహుల్‌ సభకు వివరించారు. ‘‘ మీరు సైనికులను విభజిస్తున్నారు. విధినిర్వహణలో ప్రాణాలు కోల్పోతే ఒకరిని అమరుడు అంటున్నారు. మరొకరిని అగ్నివీరుడు అంటున్నారు. ఒకరికి పింఛను వస్తుంది. మరొకరికి రాదు. అగ్నివీరుడు జవాన్‌గా పిలిపించుకోలేడు. మీరన్నట్లుగా దేశభక్తుడిగానే మిగిలిపోతాడు’’ అంటూ అగ్నివీర్‌, జవాన్‌కు మధ్య తేడాలను వివరిస్తూ అధికార పక్షంపై మండిపడ్డారు.

158 సంస్థల అభిప్రాయాలు తీసుకున్నాం: రాజ్‌నాథ్‌

రాహుల్‌ మాట్లాడుతున్న సమయంలో.. ప్రధాని మోదీ, హోం శాఖ మంత్రి అమిత్‌షా మధ్య కూర్చున్న రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ వెంటనే లేచి నిలబడి అభ్యంతరం వ్యక్తం చేశారు. తప్పుడు ప్రకటనలు చేస్తూ.. రాహుల్‌ గాంధీ సభను దప్పుదోవపట్టిస్తున్నారని అన్నారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అగ్నివీర్‌ కుటుంబానికి రూ. కోటి ఆర్థిక సాయం అందజేస్తున్నట్లు చెప్పారు. ఓవైపు రాజ్‌నాథ్‌ మాట్లాడుతుండగానే.. ‘నేను తప్పు మాట్లాడలేదు.. నేను తప్పు మాట్లాడలేదు’ అంటూ రాహుల్‌ నిరసన వ్యక్తం చేశారు.

అయితే, రాహుల్‌.. పరిహారం, పింఛన్‌పై అభ్యంతరం వ్యక్తం చేయగా.. రాజ్‌నాథ్‌ మాత్రం కేవలం పరిహారంపై మాత్రమే సమాధానమిచ్చారు. అగ్నివీర్‌ పథకం తీసుకొచ్చే ముందు చాలా ఆలోచించామని, పలువురు నిష్ణాతులు, 158కి పైగా సంస్థల నుంచి అభిప్రాయాలు స్వీకరించిన తర్వాతే దీన్ని అమల్లోకి తీసుకొచ్చామని రాజ్‌నాథ్‌ వివరించారు. ఈ పథకంలో ఉన్న నిబంధనల ప్రకారం.. విధినిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అగ్నివీర్‌ కుటుంబ సభ్యులు పింఛన్‌ పొందేందుకు అర్హులు కాదు. అయితే, ఈ సందర్భాల్లో వారి కుటుంబాలకు రెగ్యులర్‌ జవాన్ల మాదిరిగానే పింఛన్‌ వెసులుబాటు కల్పించాలని ఫిబ్రవరిలో పార్లమెంటరీ ప్యానెల్‌ ప్రతిపాదించింది. దీనిపై ఇంకా ఎలాంటి నిర్ణయం వెలువడలేదు.

‘మోదీజీ నవ్వరెందుకో’.. రాహుల్‌ ప్రశ్నకు ప్రధాని ఏం చెప్పారంటే?

యువతను దేశ రక్షణలో భాస్వాములను చేయడమే లక్ష్యంగా 2022లో కేంద్రం అగ్నిపథ్‌ పథకాన్ని తీసుకొచ్చింది. ఆర్మీ, నేవీ, వైమానిక విభాగాల్లో నాలుగు ఏళ్ల సర్వీసు కోసం 17.5 ఏళ్ల నుంచి 21 ఏళ్ల లోపు యువకులను దీని కోసం ఎంపిక చేస్తారు. వీరిని అగ్నివీర్‌లుగా పిలుస్తారు. వీరిలో 25 శాతం మంది సేవలను 15 ఏళ్లకు మించి వాడుకోవచ్చు. మిగతా వారిని ఆర్థిక ప్యాకేజీ ఇచ్చి సర్వీసు నుంచి రిటైర్‌మెంట్‌ ఇస్తారు. అయితే, 25 ఏళ్ల వయస్సులో అగ్నివీర్‌లను కేంద్రం నిరుద్యోగులుగా మారుస్తోందని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.

అంతేకాకుండా స్వల్పకాలిక రిక్రూట్‌మెంట్‌ల వల్ల దళాల్లో ఐక్యత కొరవడుతుందని కాంగ్రెస్‌ వాదిస్తోంది. రెగ్యులర్‌ సైనికులతో కలిసి పని చేస్తున్నప్పటికీ... వాళ్లతో పోలిస్తే జీతభత్యాలు, పింఛన్‌ విషయంలో తేడాలు ఉండటం కూడా వారిని ప్రభావితం చేస్తుందని చెబుతోంది. అయితే, నాలుగేళ్ల సర్వీసు ముగింపు సమయంలో అగ్నివీర్‌లకు మంచి ఆర్థిక ప్యాకేజీ ఇస్తున్నామని, ఆ మొత్తంలో జీవితంలో వారు నిలదొక్కుకునేందుకు అవకాశం ఏర్పడుతుందని కేంద్రం అంటోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని